Aug 06,2021 10:50

న్యూ ఢిల్లీ : ఇక నుండి భారతదేశంలో అత్యవసర డయల్‌ నెంబర్‌గా ఒకే ఒక్క నెంబర్‌ 112 రానుంది. ఇప్పటివరకు దేశంలో అత్యవసర డయల్‌ నెంబర్‌గా ప్రజలంతా 100 ను వినియోగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఈ 100 స్థానంలో 112 నెంబర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నిర్ణయించింది.

మరో రెండు నెలల వరకే 100..
మరో రెండు నెలల వరకు మాత్రమే ఈ డయల్‌ 100 అందుబాటులో ఉండనుందని, ఆ తర్వాత అత్యవసర డయల్‌ నెంబర్‌గా దేశవ్యాప్తంగా 112 వినియోగంలోకి రానుందని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో పోలీసు శాఖకు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక శాఖకు 101 నెంబర్లను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు.. విపత్తు నివారణ, గృహహింస, వేధింపుల బాధితులకు సేవలందించడానికి ఒకే నంబరు 112 ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రెండేళ్ల క్రితమే నిర్ణయం..
అమెరికా దేశంలో అమలులో ఉన్న 911 తరహాలో భారతదేశంలోనూ ఒకే అత్యవసర నంబర్‌ ఉండాలని రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పూర్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆదేశాలను కూడా జారీ చేసింది. దీంతో 112 పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

ఆటోమేటిక్‌గా 112 కు అనుసంధానం..
పలు సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పుల కారణంగా దేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా ఎక్కడా 112 నంబరు అమలు కావడం లేదు. దీంతో హోం మంత్రిత్వశాఖ గతేడాది చివర్లో అన్ని రాష్ట్రాలను సంప్రదించి మార్చిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించింది. అప్పటి నుంచి ప్రజలు, బాధితులు 100, 108, 101 ఇలా ఏ అత్యవసర సేవలకు ఫోన్‌ చేసినా దానంతట అదే 112 కు అనుసంధానమయ్యేలా చేశారు.

10 నుండి 8 నిముషాలకు తగ్గింపు..
ఒకటి, రెండు నెలల్లో డయల్‌ 112 పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీస్‌ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా డయల్‌ 100 కు ఫోన్‌ చేస్తే.. 10 నిమిషాల్లో అత్యవసర స్పందన బృందం (ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం) సంఘటన స్థలాలకు చేరుకుంటోంది. ఈ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 8 నిమిషాలకు తగ్గించనున్నారు.

రాష్ట్రాలకు ఆదేశం..
దేశవ్యాప్తంగా అత్యవసర నెంబర్‌ను తీసుకురావడానికి ముందుగా కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదించింది. అనంతరం 112 ను అత్యవసర సహాయ నెంబర్‌గా ప్రకటించింది. ప్రజల్లో అవగాహన కల్పించేలా అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబరునాటికి అన్ని అత్యవసర సేవలకు 112 నంబరుకు ప్రజలు కాల్‌ చేసేలా చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

112 వినియోగంపై పోలీసు శాఖ చర్యలు..
112 వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ పలు చర్యలను ప్రారంభించింది. మరో రెండు నెలల వరకే 100 నెంబర్‌ పనిచేస్తుందని, ఆ తర్వాత ఎవరైనా ఒకవేళ 100 కు కాల్‌ చేసినా అది ఆటోమేటిక్‌గా 112 కు లింక్‌ అవుతుందని పోలీసు శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల చివరిలోగా... 112 కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కంట్రోల్‌ రూంలో పనిచేసేవారికి నేర్పాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద ప్రజలకు అర్ధమయ్యేలా బోర్డులు, సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది.

కర్నాటక, తమిళనాడులో ప్రత్యేక కంట్రోల్‌ రూంలు...
ఈ ఏడాది ప్రారంభం నుండే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు 112 పై ప్రచారాన్ని ప్రారంభించాయి. వందలమంది ఒకేసారి ఫోన్‌ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశాయి. కర్నాటకలోని పోలీస్‌ వాహనాలపై 112 స్టిక్కర్లను అతికించారు. సామాన్యులకు అర్థమయ్యేలా కర్నాటకలోని ప్రధాన కూడళ్ల వద్ద ప్లకార్డులతో ప్రదర్శనలు చేపడుతున్నారు. మరోవైపు... తమిళనాడులోని చెన్నై, మదురై నగరాల్లోనూ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో వీలైనంత త్వరగా డయల్‌ 112 ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఎస్‌.పటేల్‌ ఇటీవల ప్రకటించారు.