Jul 04,2023 22:33

పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌,

           పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తి జిల్లా మొత్తాన్ని డిజిటల్‌ ఎకానమీ దిశగా మార్చాలని, ఆ దిశగా దీనిని నెరవేర్చేందుకు అందరూ కలసి వస్తే వచ్చే శ్రీ సత్యసాయిబాబా జయంతి నాటికి జిల్లా మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారు. న్యూఢిల్లీ నుంచి మంగళవారం నాడు వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను బటన్‌ నొక్కి ప్రారంభించారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. ఈయనతో పాటు శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌, శ్రీసత్యసాయి ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హైయర్‌ లర్నింగ్‌ ఛాన్సలర్‌ కె.చక్రవర్తి, శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీలు రహైకో హిర, ఎస్‌ఎస్‌.నాగానంద్‌ వి.మోహన్‌, శ్రీసత్య సాయి సేవ ఆర్గనైజేషన్స్‌ ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్‌ నిమిష్‌ పాండ్యాలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. ఏ ఆలోచన అయినా మానవతా విలువలతో కూడిన కార్యాచరణ సాగించినప్పుడు అత్యంత ప్రభావితంగా ఉంటుందన్నారు. సత్యసాయిబాబా మానవాళికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారని, ఆయన చూపిన మార్గం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. పుట్టపర్తిలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభం మరో అద్భుతం అన్నారు.
సాంకేతిక, ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్‌
ప్రస్తుతం భారతదేశం కూడా తన విధులకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన అభివృద్ధి దిశగా కదులుతోందని ప్రధాని తెలిపారు. స్వాతంత్య్ర శతాబ్ధి దిశగా పయనిస్తూ అమత్‌కాల్‌కి 'కర్తవ్య కాల' అని పేరు పెట్టాం అన్నారు. ఈ ప్రతిజ్ఞల్లో ఆధ్యాత్మిక విలువల మార్గదర్శకత్వం, భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయన్నారు. భారతదేశం సాంకేతికత, ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఉందన్నారు. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు మద్దతునిచ్చే ప్రపంచంలోని టాప్‌ 5 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఇప్పుడు ఒకటిగా మారిందని చెప్పారు. డిజిటల్‌ టెక్నాలజీ, 5జీ వంటి రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో భారత్‌ పోటీ పడుతోందని పేర్కొన్నారు.
సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించిన గవర్నర్‌
పుట్టపర్తికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మంగళవారం ఉదయం ప్రశాంతి నిలయంలోని భగవాన్‌ శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. అంతకుముందు ప్రశాంతి నిలయంలో ఉన్న శాంతిభవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ని కలెక్టర్‌ అరుణ్‌బాబు, జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నంది విగ్రహాన్ని అందజేశారు. ప్రశాంతి నిలయంలో గౌరవ మర్యాదపూర్వకంగా పోలీసుల వందనంను గవర్నర్‌ స్వీకరించారు అనంతరం రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
విలేకరులకు నో ఎంట్రీ
సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక మీడియాకు అనుమతి నిరాకరించారు. కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన విలేకరులు ఎవరినీ లోపలికి పంపలేదు. దీంతో విలేకరులందరూ బయటనే వేచి ఉండాల్సి వచ్చింది. పాత్రికేయులను అనుమతించకుండా సత్యసాయి ట్రస్టు తీసుకున్న నిర్ణయంపై పలువురు పాత్రికేయులు అసహనం వ్యక్తం చేశారు.