ప్రజాశక్తి -కొమరాడ : మండలంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు లాబేసి వంతెన పనులను పూర్తి చేయాలని కోరుతూ వంతెన సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్ష మంగళవారం ఆరో రోజు కొనసాగింది. ఈ రిలే దీక్షకు ప్రముఖ రచయిత గంటేడ గౌర్నాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.పండు, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రజలకు ఎంతో అవసరమైన వంతెన నిర్మాణం మధ్యలో నిలిపివేయడం దారుణమన్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి తప్ప ఇలా నిర్లక్ష్యంగా గాలికి వదిలేయడం సమంజసం కాదన్నారు. ముఖ్యంగా వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో నాగావళి నదిలో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేసే దుస్థితి ఇక్కడికి ప్రజలకు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగుతున్నా కనీసం వంతెన నిర్మాణంపై ఎందుకు శ్రద్ధ వహించడం లేదో అర్థం కావడం లేదని తెలిపారు. మండలంలో 31 పంచాయతీలు సంబంధించి అందులో 9 పంచాయతీలకు అతిముఖ్యమైన వంతెన దేవుకోన పంచాయతీ పూర్ణపాడు -లాబేసు వంతెన పెండింగ్ పనులు పూర్తిచేసి గిరిజన ప్రాణాలు కాపాడాలని సాధన కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు కళ్లు తెరిచి ప్రజలకు ఎంతో అవసరమైన పూర్ణపాడు-లాబేసు వంతెన పనులు ప్రారంభించి త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలని ఈ సందర్భంగా వారు కోరరు. ఈ రిలే నిరాహారదీక్షల్లో సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, పకీరు శంకర్రావు, లక్ష్మణరావు పోలి నాయుడు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.










