- వైద్య సేవలు అందించాలి
- సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కూనవరం
మండల వ్యాప్తంగా విష జ్వరాలు, ప్రధానంగా డెంగీ జ్వరాలు విజృంభించాయని, ప్రతి ఇంటిలోనూ జ్వర బాధితులు ఉన్నారని సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు అన్నారు. జ్వర బాధితులు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లు లేని కారణంగా ప్రాణ భయంతో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారని పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత సమస్యను గడిచిన రెండు సంవత్సరాల నుండి సిపిఎం ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు వ్యవహరించారు తప్పా వైద్యులను నియమించలేదని విమర్శించారు. దీంతో పోలిపాక గ్రామంలో ప్రజలు డెంగీ సమస్యతో బాధపడుతుందని, ముల్లూరు గ్రామానికి చెందిన డెంగీ రోగులు భద్రాచలం ప్రైవేటు వైద్యశాలలో వేల రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక వేలాది రూపాయలు ఖర్చు చేసి ప్రజలు ఆర్థికంగా కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్పా మండల ప్రజలకు వైద్యం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్లను నియమించి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, జక్కుల వీరబాబు, కొండా నాగమణి, ఈశ్వర్లు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.










