ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునేందుకు దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, రైతుసంఘం మండల కార్యదర్శి కోటకొండ సూరి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సూరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీరశేఖర్ మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ దాదాపు చివరి దశకు వచ్చిందని, వర్షాలు ఆశాజనకంగా లేకపోవడం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని మండలంలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. జూన్, జులైలో రైతులు వేసిన విత్తనాలు మొలవక తిరిగి విత్తనాలు వేశారని చెప్పారు. అవి కూడా మొలవక మళ్లీ ఆగస్టులో విత్తనాలు వేశారని, రెండు, మూడు సార్లు విత్తనాలు వేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం మండలాన్ని కరువుగా ప్రకటించాలని కోరారు. ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో ఉన్న చెరువులకు హంద్రీనీవా ద్వారా నీటిని మళ్లించాలని, చెరువుపై ఆధారపడిన భూముల్లో పంటలు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కరువుపై ప్రజాప్రతినిధులు స్పందించి కరువు మండలంగా ప్రకటింపజేసి రైతులను ఆదుకునేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. రైతులు బజారి, ప్రహ్లాద, హమీద్, రంగన్న, ఎల్లప్ప, మల్లేష్, బాష పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు










