Aug 17,2023 22:54

 కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు
ప్రజాశక్తి-తోట్లవల్లూరు :
దేవాలయ భూములను కౌలుకు సాగు చేస్తున్న కౌలుదారులందరికి కౌలు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు అన్నారు. గురువారం తోట్లవల్లూరు శివాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరికి కౌలు కార్డు ఇవ్వాలని ఆయన కోరారు. ఆరుగాలం కష్టించి దేశానికి అన్నం పెట్టే రైతుకు గోడ దెబ్బ చంపదెబ్బ లాగా వాతావరణ సమతుల్యం లోపించి అప్పటికప్పుడే అకాల వర్షాలు అప్పటికప్పుడే విపరీత ఎండలు రావడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారన్నారు. అధిక వర్షాల వల్ల పంటలు మొనకకు గురై పాడైపో తున్నాయని, మండుటెండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని దీంతో అగమ్య గోచరంగా రైతు పరిస్థితి తయారయిందని దీనిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరికి సిసిఆర్సి కార్డులు ఇప్పించాలని అన్నారు. ప్రస్తుత కాలంలో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, విపరీతంగా ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోవడం ఒక కారణమైతే మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతుల్ని అతలాకుతలం చేస్తున్నాయని దీనివల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని అన్నారు. దేవాలయ భూములు సాగు చేసే కౌలు రైతులకు కార్డులు ఇవ్వడానికి పత్రంలో భూ యజమాని సంతకం అని ఉన్న ప్రాంతంలో దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ అధికారి గాని దానికి సంబంధించిన అధికారి గాని సంతకం పెట్టి కార్డులు మంజూరు చేయాలని కోరారు. కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు మంజూరు చేయాలని, పంట నష్టపరిహారం, పంటల భీమా అందేలా చేయాలని కోరారు. రాష్ట్రంలో దేవాలయ భూములు సాగు చేసే కొన్ని వేల మందికి సిసిఆర్సి కార్డులు ఇవ్వలేదని వారందరికీ ఇచ్చేలా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కౌలు రైతు సంఘం తరఫున వినతిపత్రం అందించామని ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకొని కౌలు గుర్తింపు కార్డులు పొందాలని తెలిపారు. రాష్ట్రంలో కౌలు రైతు సంఘం తరఫున గ్రామ గ్రామాన తిరిగి దేవాలయ భూములు సాగు చేసే కౌలు రైతులకు కార్డులు ఇప్పించేలా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమతో నడిచి కౌలు గుర్తింపు కార్డులు పొందాలని కోరారు.కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె. శివ నాగేంద్రం,అద్దేపల్లి శ్రీమన్నారాయణ, వీరంకి శ్రీనివాసరావు ఏమి నేని లెనిన్‌ బాబు అంబటి శ్రీనివాసరావు, మారుమూడి సుబ్బారావు, ఆసిలేటి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.