Aug 14,2023 23:38

ప్రజాశక్తి-కాట్రేనికోన
అది డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ఒక పల్లెటూరు. అ గ్రామంలోని ప్రజలు తరతరాలుగా భారతదేశ రక్షణకొరకు కవచంలా నిలబడుతున్నారు. ఇండియన్‌ ఆర్మీలో జవాన్లుగా చేరి దేశ రక్షణ విధులలో పాలుపంచుకొంటున్నారు. దేశ రక్షణకు సరిహద్దుల్లో పనిచేయడానికి ఎవరైనా వెళితే తమ కుమారుడు మిలటరీలో పనిచేస్తున్నాడని తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు. జవానుకు ఉన్న గొప్పతనం, గౌరవం అలాంటిది. ఒక ఊరికే ఆ పేరొస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. కాట్రేనికోన మండలం కందికుప్ప పంచాయతీ శివారు మిలటరీపేట ఆ ఘనత పొందింది.కాట్రేనికోన మండలంలోని కందికుప్ప గ్రామ పంచాయతీ పరధిలో ఉన్న ఈ గ్రామానికి సుమారు 55ఏళ్ల క్రితంనుండే మిలటరీ పేటగా పేరు స్థిరపడింది..మొదటగా ఈ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులుభారత సైన్యంలో చేరి సేవలందిస్తూ సెలవుల సమయంలో స్వగ్రామాలకు వచ్చి గ్రామంలోని పలువురు యువకులను సైన్యంలో చేరేలా వారిలో దేశభక్తిని పెంపొందిస్తూ ప్రోత్సహించడంతో గ్రామంలోని అనేకమంది యువకులు ఇండియన్‌ ఆర్మీలో చేరారు.మిలటరీ పేటలో ఒకే కుటుంబానికి చెందిన అన్నయ్య, తమ్ముడు, బాబారు, పెదనాన్న, బావ, బావమరిది ఇలా పన్నెండు మంది ఇప్పటికీ ఆర్మీలో సేవలందించడం విశేషం. గ్రామంలో మొదటగా ఆర్మీలోచేరి ఇక్కడి యువకులకు ఆదర్శంగా మారి గ్రామానికి మిలటరీపేటగా పేరు సార్దకం అయ్యేందుకు దోహదపడిన జనిపెల్ల సోమరాజును గ్రామంలోని ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటారు . పలువురు యువకులు సోమరాజు స్ఫూర్తితో సైన్యం లో చేరేలా దేహదారుఢ్యం, ఇతర కసరత్తులు చేస్తూ నిరంతరం సన్నద్ధం అవుతూ శిక్షణ పొందుతున్నారు. భారతదేశం బ్రిటిష్‌ వారి కబంధ హస్తాలనునుండి విడువడి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీకా అమత్‌ మహోత్సవ్‌లో అమర జవానులను స్మరించు కుంటూ మిలటరీపేటను ఆదర్శంగా తీసుకుని మరికొందరు యువకులు అర్మీలో చేరాలని ఆశిద్దాం.