Oct 30,2023 20:36

దున్నేసిన వేరుశనగ మొక్కలను చూపిస్తున్న రైతు గంగన్న

ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన రైతు బోయ గంగన్నకు సంబంధించిన నెలరోజుల వేరుశనగ పంటను దౌర్జన్యంగా కొందరు ట్రాక్టర్‌తో తొలగించారు. సోమవారం బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల మేరకు... కరివేముల రెవెన్యూ పరిధిలో రైతు బోయ గంగన్నకు 1.34 ఎకరాల పట్టాదారు పొలం ఉంది. ఆ పొలానికి ఆనుకొని ఉన్న కొంత ప్రభుత్వ భూమిని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కరివేముల గ్రామానికి చెందిన ఎరుకల రామాంజనేయులు, ఆయన కుమారుడు రవి మరి కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ట్రాక్టర్‌తో రెండెకరాల పొలంలోని నెలరోజుల వేరుశనగ పంటను దున్నేశారు. దౌర్జన్యంగా వేరుశనగ పంటను తొలగించడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.