Sep 02,2023 22:13

విధుల్లో చేరిన ట్రాన్స్‌కో ఎఇ శాంతారావు

మక్కువ : అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో మక్కువ ట్రాన్స్‌ కో ఎఇ కేసు సంచలనంగా మారింది. ఎసిబి ట్రాప్‌ నుంచి తప్పించుకున్న దాఖలాలు ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలో లేదు. కానీ మన్యం జిల్లా మక్కువ మండలంలో ఈనెల 27వ తేదీ రాత్రి జరిగిన ఎసిబి దాడి కేసు చరిత్రను తిరగరాసింది. ఈ దాడిలో మక్కువ ట్రాన్స్‌కో ఎఇ పోలాకి శాంతారావు తప్పించుకొని శుక్రవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. దీంతో ఎసిబి అధికారులు అతన్ని అరెస్టు చేసి విశాఖపట్నం ఎసిబి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి ఎసిబి కోర్టు న్యాయమూర్తి ఆదేశాలతో శాంతారావుకు బెయిల్‌ మంజూరైంది. దీంతో శనివారం స్థానిక ట్రాన్స్‌కో కార్యాలయంలో విధుల్లో చేరి స్థానిక సిబ్బందితో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న వెంటనే మీడియా సంబంధిత కార్యాలయానికి వెళ్లనప్పటికీ ఎఇ శాంతారావు అందుబాటులో లేరు
ఫిర్యాదు దారుల్లో టెన్షన్‌.. టెన్షన్‌.
ఎఇ శాంతారావును ఎసిబికి పట్టించిన ఫిర్యాదారుల్లోను, వారికి సహకరించిన కొంతమంది ట్రాన్స్‌కో డిపార్టుమెంట్‌కు సంబంధించిన వారిలోనూ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఒక కాంట్రాక్టర్‌ ఎఇని ట్రాప్‌ చేయించడం వరకు తెర వెనుక ఉండి తతంగం నడిపినట్లు చర్చ జరుగుతోంది.
ఎసిబి అధికారులకు తలనొప్పి
ఈకేసు అవినీతి నిరోధక శాఖకు తలనొప్పిగా మారింది. ఎసిబికి పట్టుబడిన కేసు ఆదిలోనే బెడిసి కొట్టిన విధంగా మారిన తీరు చూస్తుంటే ఆ శాఖ పనితీరును ప్రశ్నించేలా మారిందని పలువురు విశ్లేషిస్తున్నారు.