Aug 30,2023 20:37

కార్యాలయం ముందు కూర్చున్న రైటర్లు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
ప్రజల ఆస్తులకు సంబంధించి యాజమాన్య హక్కు పత్రాలైన డాక్యుమెంట్ల రూపకల్పన విధానాన్ని ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి నిరసనగా బుధవారం డాక్యుమెంట్‌ రైటర్లు ఆదోనిలో పెన్‌డౌన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్‌ లెటర్లు పవన్‌, విజరు, ప్రతాప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు పేరుతో కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తోందని తెలిపారు. త్వరలోనే జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టనుందని పేర్కొన్నారు. సేల్‌డీడ్స్‌ వంటివి జరిగితే ఏవైనా లోపాలు చోటుచేసుకుంటే ఆస్తులు కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ప్రక్రియను అమల్లోకి తెస్తే ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌ విధానంలో అమ్మకందారులను, కొనుగోలుదారులు మోసం చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ప్రక్రియను అమల్లోకి తెచ్చి తమ పొట్ట కొట్టవద్దని కోరారు.