May 21,2023 09:14

తెలుగు నటుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. అందుకు తగ్గట్టుగానే కథలనూ ఎంచుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో మన నటులు ప్రయోగాత్మక చిత్రాలవైపు అడుగులేస్తున్నారు. అందులో భాగంగానే ప్రేమ, ఫ్యామిలీ కథల్లో నటించే నాగచైతన్య తన పంథాకు భిన్నంగా ఎంచుకున్న కథే 'కస్టడీ'. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దీనికి దర్శకత్వం వహించాడు. సెపరేట్‌ స్టైల్‌! టేకింగ్‌, స్క్రీన్‌ ప్లేతో మేజిక్‌ చేస్తూ.. మెస్మరైజింగ్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ప్రభు దర్శకత్వం రూపొందిన 'కస్టడీ' ఎలా ఉంది? కథేంటి? తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. శివ (నాగచైతన్య) ఓ సిన్సియర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌. సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తుంటాడు. డ్యూటీ కోసం ఎంతటి వారినైనా ఎదురిస్తాడు. ఈ క్రమంలో అంబులెన్స్‌కి దారి ఇవ్వడం కోసం ఏకంగా ముఖ్యమంత్రి ద్రాక్షాయణి (ప్రియమణి) కాన్వారు ఆపి, వార్తల్లోకి ఎక్కుతాడు. డ్రైవింగ్‌ స్కూల్లో పనిచేసే రేవతిని (కృతిశెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు శివ. కులాలు వేరు కావడంతో రేవతి తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. రేవతికి వేరే అబ్బాయి (వెన్నెల కిశోర్‌) తో పెళ్లిని నిశ్చయం చేస్తాడు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని శివ, రేవతి అనుకుంటారు.

2


రేవతి కోసం వెళ్లే దారిలో.. డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో రాజు (అరవింద్‌ స్వామి), సీబీఐ ఆఫీసర్‌ జార్జ్‌ (సంపత్‌ రాజ్‌) లను అరెస్ట్‌ చేసి, స్టేషనుకు తీసుకొస్తాడు శివ. రాజును చంపడానికి పోలీస్‌ కమిషనర్‌ నటరాజన్‌ (శరత్‌ కుమార్‌) సహా ఏకంగా పోలీస్‌ ఫోర్స్‌, రౌడీలు రంగంలోకి దిగుతారు. అసలు రాజు ఎవరు? స్టేషన్‌ నుంచి రాజును తప్పించిన శివ బెంగళూరు ఎందుకు తీసుకు వెళ్లాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? ఈ కేసులో సీఎం పాత్ర ఏమిటి? ఓ సాధారణ కానిస్టేబుల్‌ స్టేట్‌ మొత్తాన్నీ ఎదుర్కొని, ఓ క్రిమినల్‌ చావకూడదని ఎందుకు ప్రయత్నించాడు? రేవతి, శివ పెళ్లి చేసుకున్నారా? అనేదే మిగిలిన కథ..
సాధారణంగా కమర్షియల్‌ సినిమాల్లో చాలా వరకూ హీరో, విలన్‌ పోరాటం నేపథ్యంలో సాగుతుంటాయి. కానీ కస్టడీ మాత్రం విలన్‌ను కాపాడటమే హీరో లక్ష్యంగా ఓ డ్రామా సెట్‌ చేస్తూ దాని చుట్టూ కథను అల్లుకున్నారు దర్శకుడు. ముఖ్యమంత్రి, పోలీస్‌ కమిషనర్‌తో పాటు రౌడీలను ఎదిరిస్తూ ఓ సాధారణ కానిస్టేబుల్‌ సాగించే ప్రయాణమే ఈ చిత్రం. ఇటువంటి కాన్సెప్ట్‌ కథలను అసాధారణంగా, రేసీగా చెప్పడం వెంకట్‌ ప్రభు స్టైల్‌. కానీ, ఎందుకో ఈసారి ఆయన స్టైల్‌ పక్కకి పెట్టి.. కథా నేపథ్యానికి తగ్గట్టు నిదానంగా ముందుకు వెళ్లారు. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్‌ రొటీన్‌ కావడంతో సినిమాలో కావాల్సిన ఎమోషన్‌ క్యారీ కాలేదు. సినిమా మొదలైన ముప్పై నిమిషాల్లోనే కథేమిటి, క్లైమాక్స్‌ ఎలా ఉండబోతుందన్నది దర్శకుడు హింట్‌ ఇచ్చేశాడు. అయితే ఆ ట్విస్ట్‌లు పెద్దగా వర్కవుట్‌ కాలేదు. అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, రాంకీ గన్‌ ఫైట్‌ సీన్‌ లాంటి హై మూవ్‌మెంట్స్‌ కొన్ని ఉన్నా ఆ టెంపో చివరి వరకూ కొనసాగించ లేకపోయారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో ప్రేమ కథ సరిగా ఇమడలేదు.
వెంకట్‌ ప్రభు చిత్రాల్లో ప్రత్యేకంగా హీరోలు అంటూ ఎవరూ ఉండరు. క్యారెక్టర్లు, క్యారెక్టరైజేషన్లు హైలైట్‌ అవుతాయి. 'కస్టడీ'కి వస్తే.. అరవింద్‌ స్వామి హైలైట్‌ అవుతారు. ఇక శివ పాత్రకి అక్కినేని నాగచైతన్య న్యాయం చేశారు. కృతిశెట్టి రోల్‌ ఓకే. 'వెన్నెల' కిశోర్‌ కొన్ని సన్నివేశాల్లో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రియమణి, సంపత్‌ రాజ్‌, శరత్‌కుమార్‌, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.

టైటిల్‌ : కస్టడీ
నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్‌ స్వామి, ప్రియమణి, శరత్‌ కుమార్‌, సంపత్‌ రాజ్‌, గోపరాజు రమణ, 'వెన్నెల' కిశోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులతో పాటు అతిథి పాత్రల్లో జీవా, ఆనంది
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : ఎస్‌ఆర్‌ కతీర్‌
సంగీతం : ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
కథ, స్క్రీన్‌ ప్లే దర్శకత్వం : వెంకట్‌ ప్రభు