Oct 25,2023 16:49
  • సిపిఎం జిల్లా నాయకులు గోవిందు

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు(కర్నూల్) : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 30న ఆదోనిలో సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు గోవిందు, హనుమంతు, డివిజన్ నాయకులు రాముడు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని చెప్పిన పాలక పార్టీలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. కర్నూలు జిల్లా నుండి ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు రాజకీయంగా అత్యున్నత పదవులు పొంది జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కర్నూలు జిల్లాలో ఒక్క భారీ పరిశ్రమ కూడా లేదు. జిల్లాలో సాగునీరు, పారిశ్రామిక రంగం, విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉన్నది. కర్నూలు జిల్లాలో సహజ వనరులకు కొదవలేదు. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో మన జిల్లా అట్టడుగున ఉందని అన్నారు. పాలక పార్టీలు ప్రజలను తమ ఓటు బ్యాంకుగా రాజకీయాలకు వాడుకోవడం తప్ప అభివృద్ధి శూన్యం. ఇప్పటికైనా ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురుచూసే లోపు మన జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తును సక్రమ మార్గంలో నడిపించి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పటికైనా అసమానత లేని అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం, కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం పదివేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం అభివృద్ధి జరగాలంటే నిధులు కేటాయించాలి. ఇందుకోసం సిపిఎం పార్టీ రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుంచి ప్రజా రక్షణ బేరి పేరుతో అక్టోబర్ 30 నుండి బస్సు యాత్రలు చేపట్టింది. అక్టోబర్ 30న ఆదోనిలో ప్రారంభమవుతున్న ఈ బస్సు యాత్రకు ముఖ్య అతిథిగా అశోక్ దావలే  సిపిఎం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు, ఎమ్.ఏ. గఫూర్ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, వి. రాంభూపాల్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రమాదేవి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హాజరవుతారు. అక్టోబర్ 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఆదోనిలో పాత బస్టాండ్ నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సురేష్, అబ్దుల్లా, కృష్ణ, రాజు, రాముడు, రమేష్ పాల్గొన్నారు.