ప్రజాశక్తి-పాలకొండ : పాలకొండలో డంపింగ్ యార్డ్ సమస్య తక్షణమే పరిష్కరించాలని ,చెత్తను తక్షణమే గ్రామానికి దూరంగా తరలించాలని, సంపూర్ణ పారిశుధ్య నివారణకు కార్మికుల సంఖ్యను పెంచాలని, సిపిఎం ఆధ్వర్యంలో పాలకొండ పట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణం,చెత్తకుప్ప వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పాలకొండ మండల కమిటీ కన్వీనర్ డి.రమణారావు మాట్లాడుతూ పాలకొండ పట్టణం రోజు రోజుకి విస్తరిస్తున్నదని సంపూర్ణ పారిశుధ్య నివారణకు తగు కార్మిక సంఖ్య లేదని, వెంకంపేట ఆనుకొని తాత్కాలికంగా డంపింగ్ యార్డ్ గత కమిషనర్ ఏర్పాటు చేశారని, నెల రోజులు మాత్రమే ఉంటుందని, పాలకొండ పట్టణానికి దూరంగా డంపింగ్ ఏర్పాటు చేస్తామని, 2020 సంవత్సరంలో హామీ ఇచ్చారు. కానీ నేటికీ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం చేయలేదని, ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యాలు పాలన పడుతున్నారని, ప్రస్తుతం పాలకొండలో ఎక్కడ చెత్త అక్కడ ఉండటం వలన ప్రజల అనారోగ్యాలకు గురి అయ్యే అవకాశం కనిపిస్తుందని, ఒకవైపు జగనన్న ఆరోగ్య సురక్ష అని ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటే పాలకొండ పట్టణంలో మాత్రం సంపూర్ణ పారిశుధ్యానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో పాలకవర్గం విఫలమైందని, తక్షణమే పాలకొండ సంపూర్ణ పారిశుధ్య నివారణకు తగు చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజలను సమీకరించి ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె.రాము, డి.దుర్గారావు, ఏ.లక్ష్మణరావు ఎం రమేష్, తదితరులు పాల్గొన్నారు.










