Oct 18,2023 15:46
  •  యాత్రను జయప్రదం చేయండి : సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి.

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా  ప్రజా రక్షణ భేరి పేరుతో  చేపట్టిన బస్సు యాత్ర అక్టోబర్ 30 తేదీన ఆదోని నుండి ప్రారంభమవుతుందని ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ పిలుపునిచ్చారు. బుధవారం  సిపిఎం ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మండపంలో విజయ్ అధ్యక్షత జరిగిన సిపిఎం నగర విస్తృత సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోవడంలేదని నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడం లేదని ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం లేదని వెనక వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడంలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. కర్నూలు జిల్లా అభివృద్ధి కొరకు గానీ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొరకు గాని  పైసా కేటాయించకుండా  జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన చేయడం బాధ్యత రాహిత్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని వస్తాను, బిజెపి మెడలు వంచి వెనకబడిన ప్రాంతాలకు నిధులు సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు కూడా బిజెపికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా పాలన చేయడం  ఆయన చేతగాని తనానికి నిదర్శనమని  విమర్శించారు. బిజెపి రాయలసీమ డిక్లరేషన్ పేరుతో రాయల సీమ ప్రజలను మోసం చేయడం తప్ప రాయలసీమ అభివృద్ధి కోసం కానీ, కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం గానీ ,కేంద్రం నుండి ఒక రూపాయి కూడా తీసుకు రాకుండానే ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో ప్రజలు త్రాగునీటి సాగునీటీ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారని వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. ఆదుకునే నాథుడే లేడని ఆయన తెలిపారు. జిల్లాలో కరువు చాయలు కనబడుతున్న కరువు గురించి  ఎవరు మాట్లాడటం లేదని ఆయన విమర్శించారు. కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఆయన కోరారు. నగర కార్పొరేషన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించు కోవడం లేదని, నగరంలో ప్రజల త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని, మరో సమర్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్న దాని గురించి పట్టించుకునే నాథుడు లేడని ఆయన విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత సమస్యలు పరిష్కారం చేయకుండా కేవలం రంగులు దిద్దుతూ, లైట్లు వెలిగిస్తూ కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. 30వ తేదీ జిల్లాలో జరుగు బస్సు యాత్రలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి షరీఫ్, అబ్దుల్లా, రామకృష్ణ, నగర నాయకులు రాజగోపాల్, కెవి. సుబ్బయ్య, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు.