ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన ప్రజలకు ఎదురవుతున్న ప్రజా సమస్యలపై అక్టోబర్ 1 నుండి నవంబర్ 7 వరకు సిపిఎం పార్టీగా సమర శంఖం కార్యక్రమం చేపడుతున్నట్లు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, తెలిపారు. బుధవారం సిపిఎం పార్టీ ఆదోని కార్యాలయంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతులు కూలీలు సామాన్య పేదల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టాన్ని పక్కడ్ బందీగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మతోన్మాద విధానాల్ని అమలు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని తెలిపారు.రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజా ఉద్యమాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ సమస్య, ఉపాధి హామీ చట్టం అమలు తీరు అంశాలపై, సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 12న కర్నూలు నగరంలో వ్యవసాయ రంగంలో సంక్షోభం ప్రభావం అంశంపై సదస్సు జరుగుతుందని చెప్పారు. అక్టోబర్ 22న ఆదోని నుండి రాష్ట్రస్థాయి బస్సుజాత ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నిటిలో రైతులు, కూలీలు, నిరుద్యోగ యువకులు, సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల నాయకులు అయ్యప్ప, భాష, చిన్న తిక్కన్న, తిక్కప్ప, శాఖా కార్యదర్శులు పాండురంగ గోవిందు అనిఫ్ బాషా, తాయప్ప పాల్గొన్నారు.










