- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం - దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఎం, సీపీఐ పార్టీలు తలపెట్టిన ప్రచారభేరి ప్రారంభం కార్యక్రమం శుక్రవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయల దేరి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడ నుండి తిరిగి ర్యాలీగా పోర్ట్ రోడ్ ,కోటవారి తుళ్ళ సెంటర్ వైపు నుండి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు ఘన నివాళులు అర్పించారు.తదనంతరం ప్రచార భేరి ప్రారంభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం, జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు,సీపీఐ ఇంఛార్జి జిల్లా కార్యదర్శి తాతయ్యలు అధ్యక్షత వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఇరు పార్టీల నాయకులను స్టేజి పైకి ఆహ్వానించగా వందన సమర్పణ సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి లింగం పిలిప్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బిజెపి, ఆర్ఎస్ఎస్, విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతూ వారిని జైల్లో పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. నూతన విద్యా విధానం ప్రవేశపెట్టి దేశంలో కుల మత తత్వాలను పెంచి పోషించాలని కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బిజెపి విధానాలు దేశానికి, రాజ్యాంగానికి ప్రమాదకరంగా మారాయని ఈ నేపథ్యంలోనే బిజెపి అనుసరిస్తున్న రాజ్యంగ, ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు ప్రచార బేరి కార్యక్రమాలు నిర్వహించి బిజెపి ప్రభుత్వం దేశానికి ,ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, ప్రజలకు, చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం అన్నారు. ఇందులో భాగంగా రాజకీయాలకతీతంగా విశాలమైన శక్తులు కూడగట్టి పోరాడతామని స్పష్టం చేశారు . సీపీఐ రాష్ట్ర నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ నేటి బిజెపి ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణకు పోరాటం చేయాల్సి రావడం దురదృష్ట కరం అన్నారు.విగ్రహాలతో ప్రజలను మభ్య పెట్టడం కాదని వారి ఆశాయల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాల్లో ఈ ప్రచార భేరి కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు.అలాగే ప్రచార భేరి కార్యక్రమం లో బాగంగా ఈనెల ,23 న గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఈ సభకు జాతీయ నాయకులు హాజరౌతరన్నారు . ఈ కార్యక్రమంలో సిపిఎం,సీపీఐ,నాయకులు, పాల్గొన్నారు.










