ప్రజాశక్తి-చిప్పగిరి : మండలం అభివృద్ధి పథంలో నడవాలంటే మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీ జూటూరు హేమలత మరయ్య,ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జూటూరు హేమలత మారయ్య అధ్యక్షతన ఎంపీడీవో కొండయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశమునకు ముఖ్య అతిథులుగా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మునూరు నారాయణ, సొసైటీ చైర్మన్ మల్లికార్జున, వైసీపీ యువ నాయకులు జూటూరు మారయ్య పాల్గొన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు గత మూడు నెలలలో జరిగిన అభివృద్ధి పనుల ను వివరించారు. ఇందులో భాగంగానే మండల వైద్య శాఖ అధికారి జమీల్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో జగనన్న సురక్ష అనే కార్యక్రమం విజయవంతం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం ద్వారా ప్రజల ఆరోగ్యరీత్యా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. జగనన్న సురక్ష సర్వేను గ్రామ వాలంటీర్లు ద్వారా నిర్వహించారని,ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పి లు నేరుగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య సర్వే నిర్వహిస్తారని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి టోకెన్లను కేటాయిస్తారని సెప్టెంబర్ 30 నుండి ప్రతి సచివాలయల్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహిస్తారని, ఈ శిబిరాల్లో నలుగురు ప్రత్యేక వైద్య నిపుణులు హాజరవుతారని, కనుక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వాలంటరీలతో సమావేశమై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ అధికారులు సమయానికి విధులకు వచ్చేలా చూసుకోవాలన్నారు. ఇరిగేషన్, ఏపీఎస్ఆర్టీసీ శాఖల నుండి సంబంధిత అధికారులు ఎవరూ కూడా సర్వ సభ్య సమావేశానికి హాజరు కాకపోవడంతో నరగడోన గ్రామ సర్పంచ్ మల్లమ్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈఓ లు సావిత్రమ్మ, బాలా నాయుడు ఏవో జయలక్ష్మి, ఏపీఎం నాగార్జున, ఏపీవో మాధవ శంకర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రసూన, పంచాయతీరాజ్ ఏఈ చోళ రెడ్డి,హౌసింగ్ ఇంచార్జ్ ఏఈ భవ్య,వెటర్నరీ డాక్టర్ ప్రసన్న బాయ్,ఎంపీటీసీలు, సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.










