ప్రజాశక్తి-చల్లపల్లి : భారదేశంలోని మణిపూర్ లో జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, మహిళలను వివస్త్రల్ని చేసి ఊరేగించిన నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతూ చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ స్త్రీలను గౌరవించే భారత దేశంలో ముగ్గురు మహిళలను వివస్త్రల్ని చేసి ఉరేగించడంతో పాటు అత్యాచారం చేసి ఓ మహిళను చంపడం దారుణమన్నారు. మైనార్టీల పై దాడులకు పాల్పడి వారి ఇళ్లను తగులబెడుతూ హత్యలు చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి మణిపూర్ లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించిన నిందులను కఠినంగా శిక్షించాలని, మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాపాడాలని, నినాదాలు చేయడంతో పాటు దాడుల్లో మృతి చెందిన వారికి కొవ్వొత్తుల వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు అడ్డాడ ప్రసాద్, కైతేపల్లి దాస్, దాసి హోజి బాబు, దాసి బసవరాజు, ఉప్పాల సాంబశివ రావు, చిర్ల కిషోర్, మాతంగి నరసింహా రావు, అర్జునరావు, సురేష్, దాసి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.










