- జిల్లా కలెక్టర్
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల పరిష్కారంలో సరైన ఎండార్స్మెంట్ ఇవ్వని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీల పరిష్కారం, పేదలందరికీ ఇళ్లు, రీ-సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 83 మరలా వచ్చిన అర్జీలు ఉన్నాయని వాటిని సంబంధిత అధికారులు సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఒకసారి పరిష్కరించబడిన అర్జీ మరలా వచ్చిందంటే జిల్లాస్థాయిలో దానిని తీవ్రంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అటువంటి అర్జీలను పరిశీలించి సంబంధిత గ్రామ కార్యదర్శులు, ఈవోపీఆర్ ఆర్డీలు తదితర సిబ్బందితో కలసి అర్జీదారుల గ్రామాలకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. అర్జీదారులు అర్జీలలో ఏమి కోరారని, అధికారులు ఏమి ఎండార్స్మెంట్ ఇచ్చారో అది సరైనదా కాదా ఒకసారి గమనించాలన్నారు. జిల్లా యంత్రాంగం అంతా కదిలి వచ్చి పరిష్కరించింది అనే భావన అర్జీదారుల్లో కలిగి వారిలో సంతృప్త స్థాయి పెంపొందేలా కృషి చేయాలన్నారు. అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వక నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టేందుకు షోకాజ్ మెమో గాని, హెచ్చరికలు గాని జారీ చేయాలన్నారు. అసలు ఎండార్స్మెంట్ ఏ విధంగా ఇవ్వాలో సరైన అవగాహన కూడా సంబంధిత అధికారులకు కలిగించాలన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటో జిల్లా అధికారులు గమనించి అందుకు అనుగుణంగా అర్జీదారుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేయాలన్నారు. సమస్య పరిష్కారం అయ్యాక సంబంధిత అర్జీదారులతో ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. జిల్లా అధికారుల స్థాయిలో పరిష్కారం కానీ అర్జీల వివరాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, ఎంపీడీవోలు తదితర క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.










