Mar 16,2023 16:14

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : గ్రామదర్శనిలో గ్రామాల్లో గుర్తించిన  సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గ్రామదర్శని కార్యక్రమం క్రింద ప్రత్యేకాధికారులు గ్రామంలో సందర్శించినపుడు 4 విడతల గ్రామదర్శనిలో గుర్తించిన సమస్యల పరిష్కారంపై గురువారం కలెక్టర్ స్పందన మీటింగ్ హాలులో గ్రామదర్శని/ మండల/ నియోజకవర్గ ప్రత్యేకాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.జిల్లాలో ఇప్పటిదాకా 4 విడతల్లో గ్రామదర్శిని నిర్వహించి 300 గ్రామాల వరకు గ్రామదర్శినిలో ప్రత్యేకారులు సందర్శించారని అన్నారు. మొత్తం 4 విడతల్లో 6,269 సమస్యలు గుర్తించగా 3,774 సమస్యలు పరిష్కరించిట్లు కలెక్టరు తెలిపారు. గత అక్టోబర్ 14న నిర్వహించిన మొదటి విడత గ్రామదర్శినిలో గుర్తించిన 16,023 సమస్యల్లో పరిష్కరించినట్లు, గత నవంబర్ 19 తేదీన నిర్వహించిన 2వ విడత గ్రామదర్శినిలో గుర్తించిన 1,622 సమస్యల్లో 17 పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. 3వ విడత గత డిశంబర్ 30న నిర్వహించామని, 1,605 సమస్యలు గుర్తించగా 957 పరిష్కరించామన్నారు. 4వ విడత (31-01-2023) 1,462 సమస్యలు గుర్తించగా 997 పరిష్కరించామన్నారు.పెండింగ్ సమస్యలలో త్రాగునీటి ట్యాంకుల క్లీనింగ్, గ్రామాల్లో శానిటేషన్ వంటి సమస్యలు,ఆర్థికేతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో అవసరమైన సిసి రోడ్లు, స్కూల్స్,అంగన్వాడి భవనాలు మరమ్మత్తులు వంటి ఆర్థిక సంబంద సమస్యలు 10 లక్షల లోపు పనులు పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు అంచనాలు రూపొందించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపేలా చూడాలన్నారు. పాఠశాలల్లో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని వేసవిలో పిల్లలకు ఇబ్బంది కలగకుండా. ఎక్కడైనా ఆర్వోలు మరమ్మత్తులు అవసరమైతే పాఠశాల నిర్వహణ నిధులతో మరమ్మత్తులు చేయించాలన్నారు. గ్రామాల్లో త్రాగునీటి పథక నిర్వహణకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రతి గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు లక్ష్యం ప్రభుత్వం జలజీవన్ మిషన్ అమలు చేస్తోందన్నారు. ఈ పథకం క్రింద గ్రామంలో త్రాగునీటికి సంబంధించి గ్రామదర్శిని సమస్యలు పరిష్కార చర్యలు గైకొనాలన్నారు. జగనన్న లే అవుట్లలో మెరక సమస్యలు, విద్యుత్ సౌకర్యం కల్పన సమస్యలు సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలన్నారు.మండల/ నియోజక వర్గ ప్రత్యేకాధికారులు ప్రతి వారం నివేదికలు సమర్పించాలని, ఇందుకోసం అవసరమైన ఫార్మెట్లు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ కి సూచించారు. వివిధ శాఖల వద్ద గ్రామదర్శని పెండింగ్ పై డిఆర్వో ప్రతి రోజు సమీక్షించాలన్నారు. మండల వారీ ప్రభుత్వ భవనాలు మరమ్మత్తులు అంచనాలు రూపొందించి పంపాలన్నారు.వివిధ శాఖల అధికారులతో వారి రెగ్యులర్ విధులతో పాటు గ్రామాల్లో సమస్యల పట్ల అవగాహన కల్గించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం మీకు గౌరవ ప్రదమైనదన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాలు క్షేత్రస్థాయిలో అమలు తీరుపట్ల అవగహన కలుగుతుందన్నారు. ప్రతి శాసన సభ్యుని పరిధిలో 2 కోట్ల వరకు, ప్రతి సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం క్రింద 20 లక్షల వరకు అభివృద్ధి పనులకు వ్యయం చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, డిపివో నాగేశ్వరనాయక్, ఆర్ డివోలు, వివిధశాఖల అధికారులు, సిపివో వై. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.