Oct 19,2023 07:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సమగ్ర కులగణనకు వచ్చే నెల 15 నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణనను కూడా రాష్ట్రంలో జరిపించాలని గత బడ్జెట్‌ సమావేశాల్లో శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణన చేయించాలని గత శాసనసభా సమావేశాల్లో తీర్మానించామన్నారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన అధ్యయన కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో రాష్ట్రంలో కులగణనను వచ్చే నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకించి ఒక యాప్‌ను కూడా రూపొందించామన్నారు. ఈ కులగణనకు గానూ బిసి నాయకులు, కులపెద్దల నుంచి సూచనలు, సలహాలు సేకరించేందుకు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో ప్రాంతాల వారీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూచనలు, సలహా లు స్వీకరించేందుకు ఒక ఇ-మెయిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.