Oct 26,2023 09:21

ప్రజాశక్తి-విజయవాడ : గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేయాలని కోరుతూ మహాధర్నా నేపథ్యంలో సిపిఎం నేత సిహెచ్.బాబురావు అరెస్ట్ చేసి, పటమట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మూడు ప్రభుత్వాలు, ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా 14 సంవత్సరాలుగా  విజయవాడ గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తికాలేదని స్థానికులు మండిపడుతున్నారు. శిలాఫలకం వేసి 5360 రోజులు పూర్తయినా వైఎస్ఆర్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆగ్రహిస్తున్నారు. ప్రమాదాలు సంభవిస్తున్నాయని, లక్షలాది మంది ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పాలకులు మొద్దు నిద్రలో ఉన్నారని, స్థానిక ప్రజలందరూ పార్టీలకతీతంగా సాధన కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో నేడు గుణదల 3 వంతెనల వద్ద మహాధర్నా తలపెట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిధులు మంజూరు చేస్తుందని ఎదురుచూశారు. స్థానిక ప్రజల పోరాటానికి అండగా, వారికి సంఘీభావం తెలియజేసేందుకు వెళుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావును పాతబస్తీ ఫ్రైజర్ పేట బ్రిడ్జిపై పోలీసులు అడ్డగించి బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ మల్లాది విష్ణు ధర్నాను విచ్చిన్నం చేయటానికి పోలీసుల ద్వారా ప్రయత్నం చేయటం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి నిర్బంధం ద్వారా ప్రజల గొంతు నొక్కటం గర్హనీయమన్నారు. పోలీస్ శాఖ సిఐలు కాశీ విశ్వనాథ్, కృష్ణమోహన్ లు పోలీసు బలగాలతో వచ్చి నడిరోడ్డుపై అడ్డగించి బాబురావు అరెస్టు చేయడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. బాబురావును బలవంతంగా పటమట పోలీస్(ఆటోనగర్) స్టేషన్ కు తరలించి నిర్బంధించారు. స్థానిక ప్రజలు గుణదల వంతెన వద్ద ధర్నాకు సమాయత్తమవుతుండగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ధర్నాను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటని తెలిపారు. అరెస్టు చేసిన బాబురావును విడుదల చేయాలని, తక్షణం బ్రిడ్జికి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని స్థానిక ప్రజలు, ఫ్లైఓవర్ బ్రిడ్జి సాధనా కమిటీ, సిపిఎం డిమాండ్ చేసింది.