Sep 27,2023 21:30

మాట్లాడుతున్న ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివిజి శంకరరావు

ప్రజాశక్తి-పార్వతీపురం : చట్టాలపై అవగాహన అవసరమని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డి.వి.జి శంకరరావు అన్నారు. బుధవారం పార్వతీపురం ఐటిడిఎ గిరిమిత్ర సమావేశ మందిరంలో సిఐడి పౌర హక్కుల రక్షణ విభాగం ఆధ్వర్యంలో ఎస్‌టి, ఎస్‌సి సాధికారిత, అత్యాచారాల నియంత్రణ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన పొందాలన్నారు. కొన్ని సందర్భాల్లో బలహీనులు బాధితులుగా మారతారని, వాటికి వ్యవస్థలు సహకరించి న్యాయం చేయాలని అన్నారు. చట్టం అంటే శిక్షించేది కాదని, బాధ్యతలను తెలియజేసేది, రక్షణగా నిలిచేది అని ఆయన వివరించారు. వాటిపై సమగ్ర అవగాహన అవసరమని, ఇందుకు విద్య దోహదం చేస్తుందని చెప్పారు. విద్యతో వివేకం పెరిగి సామాజిక జ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పిస్తుందని, పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బాధితులకు అండగా ఎస్‌టి కమిషన్‌ ఉంటుందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు తమ పరిధిలో చట్టాలు, నియమాలు, ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వారికి క్విజ్‌ను నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన ఎ.షర్మిలదేవి, ఎం.రామలక్ష్మి, డి.సంగీత, జి.గౌరీశ్వరికి, చక్కని అవగాహన కల్పించిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పక్కి లావణ్యకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐడి విశాఖ ప్రాంతీయ కార్యాలయ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎం.ఎన్‌.భూపాల్‌, సిఐడి డిఎస్‌పి ఎల్‌.నాగేశ్వరి, లక్ష్మణరావు, ఇన్‌స్పెక్టర్లు జి.గోవింద రావు, బివిజి ప్రసాద్‌, ఎస్‌సి, ఎస్‌టి సెల్‌ డిఎస్‌పి జి.మురళిధర్‌, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కె. శ్రీనివాసరావు, ఎస్‌సి, ఎస్‌టి కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.వెంకట నాయుడు, ఎంపిడిఒ జివి రమణ, సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.శశిభూషణ రావు, అఖిల భారత ఎస్‌టి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.నాగేశ్వరరావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఆరిక శాంతికుమారి, తదితరులు పాల్గొన్నారు.