Nov 12,2021 20:19

వాషింగ్టన్‌ : చంద్రుని వాతావరణంలో మానవ జీవనానికి తగినంత ఆక్సిజన్‌ లేకపోయినా, రాళ్లతో కూడిన పై పొరలో 800 కోట్ల మందికి లక్ష సంవత్సరాలకు సరిపడా ప్రాణవాయువు ఉన్నట్లు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని సదరన్‌ క్రాస్‌ యూనివర్శిటీలో సాయిల్‌ సైన్స్‌లో లెక్చరర్‌ అయిన జాన్‌ గ్రాంట్‌ 'ది కన్వర్సేషన్‌'లో ఈ మేరకు ఒక వ్యాసం రాశారు. చంద్ర మండలంలో భారీగా ఖనిజ లవణాలు వున్నాయని, అవన్నీ ఆక్సిజన్‌తో మిళితమై వున్నాయన్నారు. మనిషికి రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్‌ అవసరమవుతుందని, ఉపరితలానికి 10మీటర్లు (33 అడుగులు) అడుగున ఉన్న రెగోలిత్‌ పొర 45శాతం ప్రాణవాయువుతో నిండివుందని జాన్‌ గ్రాంట్‌ వివరించారు.