ప్రజాశక్తి-కనిగిరి: టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ అనంతపురం నుంచి అమరావతి వరకు ఆయన చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర బుధవారం కనిగిరికి చేరుకుంది. కనిగిరి నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ నాయకులతోపాటు, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. తదుపరి అమరావతి గ్రౌండ్లో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దళితుల సంక్షేమ మరిచిన వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కనిగిరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వచ్చే ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గం ఇన్‌చార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి, రాష్ట్ర అభివృద్ధిని మరిచిన ఘనత జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ, బూటకపు హామీలను నమ్మి మరలా మోసపోవద్దని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని అన్నారు. డాక్టర్ ఉగ్రను కనిగిరిలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని పేర్కొన్నారు. డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ దుర్మార్గపు పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యపరుస్తూ ఎమ్మెస్ రాజు సైకిల్ యాత్రను చేపట్టడం అభినందనీయమని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, కనిగిరి ప్రాంత అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. కనిగిరి అభివృద్ధి ఎవరితో సాధ్యమవుతుందో వారికే ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి రాచమల్ల శ్రీనివాసరెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, బారా ఇమామ్, తమ్మినేని వెంకటరెడ్డి, నంబుల కొండయ్య, పాలూరి సత్యం, ఈదర రవికుమార్, చింతలపూడి తిరుపాలు, ఆర్‌వి నారాయణ, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.










