May 25,2023 22:40

నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

హిందూపురం : తెలుగుదేశం పార్టీ అధినేత పెత్తందారుల పక్షమనిఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ విమర్శించారు. చంద్రబాబు దళితులపై చేసిన వ్యాఖ్యలతో పాటు, రాజధానిలో పేదలకు ఇస్తున్న ఇంటి పట్టాల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు పురపాలక సంఘ కార్యలయం ముందు భగత్‌ సింగ్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపీ, ఎమ్మెల్సీ మాట్లాడుతు అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకిచ్చే సెంటు స్థలం 'మీ శవాన్ని పూడ్చడానికి సరిపోతుంద'ంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామిక, అహంకార, పూరితమైనవని వారు విమర్శించారు. ఆ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిఎం జగన్‌ పేదల పక్షపాతి అని అన్నారు. పేదలు పేదలుగానే ఉండాలని పెత్తనం తమ చేతుల్లోనే ఉండాలనే స్వభావం చంద్రబాబుది అని వారు విమర్శించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా పేదలే గెలిచారని, హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా పేదల పక్షానే నిలబడ్డాయని, పేదల తరఫున పోరాటం చేసి విజయం సాధించామని అన్నారు. పేదలకు భూములు ఇవ్వాలని ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సమాధి అన్న ఆ సెంటు స్థలంలోనే పేదలు టీడీపీని సమాధి చేయనున్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మన్‌ జబివుల్లా, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.