Oct 06,2023 08:49

మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

       అనంతపురం : చంద్రబాబు నాయుడు మెప్పుకోసమే మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌లు ధర్నాలు, నిరసనల డ్రామాలు ఆడుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నాడు రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో 'ఎందుకు ఆంధ్రాకు జగనే కావాలి' కార్యక్రమంలో గహసారథులు, వాలంటీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కేసులపై అరెస్ట్‌ అయిన పరిటాల రవి జైళ్లో ఉన్నప్పుడు పరిటాల సునీత ఎప్పుడూ ధర్నాలు చేయలేదన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాప్తాడులో పరిటాల సునీతకు, ధర్మవరంలో శ్రీరామ్‌కు టిడిపి అధిష్టానం టికెట్టు ఇవ్వదన్నారు. అందుకు నిరసన డ్రామాలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు, పరిటాల సునీత ప్రజలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. వైసిపి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పాలన సాగుతోందని చెప్పారు. చంద్రబాబు పెద్దలకు సాయం చేశారు తప్పితే పేదలను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతిని ఎండగడుతూ ఈనెల 8న అనంతపురంలో 'ధర్మ సంకల్ప సభ' పేరుతో భారీ ర్యాలీ చేపడుతున్నామన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.