Sep 12,2023 21:54

ఉమ్మడి అనంతపురం జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న టిడిపి నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయన విడుదల అయ్యేంత వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరవధిక నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు ఆ పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని అనంతపురం బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. టిడిపి హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బికె.పార్థసారథి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జితేంద్రగౌడ్‌, కందికుంట వెంకటప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టిడిపి కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్‌ఛార్జి ఉమా మహేశ్వరనాయుడు, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటి మడుగు కేవవరెడ్డి, హిందూపురం నియోజకవర్గం నాయకులు అంబికా లక్ష్మినారాయణ, టిడిపి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, మాజీ మేయర్‌ స్వరూప, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు గౌస్‌మొద్దీన్‌, మాజీ జడ్పీటిసి రాంమ్మోహన్‌ నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బికె.పార్థసారథి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌కు సంబంధించి ఎక్కడా రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు. కావాలనే జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబును కేసులో ఇరికించాడని తెలిపారు. 16 నెలలు జైలు శిక్ష అనుభించిన జగన్‌మోహన్‌రెడ్డి కావాలనే చంద్రబాబును జైలుకు పంపాడని దుయ్యబట్టారు. న్యాయపోరాటంలో టిడిపి అధినేత మచ్చలేని చంద్రుడిగా, కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు రావడం ఖాయం అన్నారు. ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మద్దతుతో జగన్‌కు గుణపాఠం నేర్పాల్సి ఉందన్నారు. బుధవారం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ అధినేత అరెస్టులతో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందాలనే అపోహల్లో ఉందన్నారు. వారి అనుకున్నట్లు ఏదీ జరగదన్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అధికారంలో రాగానే హత్యా రాజకీయాలు జరిగాయని తెలిపారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చాక ఆర్థిక వనరులను దెబ్బతీస్తూ ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ అధినేత చంద్రబాబుకు జరిగిన ఇబ్బందులపై ప్రతి నాయకుడు, కార్యకర్త బరువెక్కి హృదయంతోనే నిరసనలు తెలియజేస్తున్నారని తెలిపారు. అధినేతను విడుదల చేసేంత వరకు ఐక్యంగా పని చేద్దామన్నారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ మొండిగా పరిపాలన చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పుదామన్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ కుట్ర రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. మాజీ పరిటాల సునీత మాట్లాడుతూ అధినేత విడుదల చేసేంత వరకు మహిళా పోరాడుదామన్నారు.