Apr 28,2023 22:18

జెండా ఊపి రీసర్వేను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు చెల్లని రాజకీయవేత్త అని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి విమర్శించారు. శుక్రవారం పట్టణ సమీపంలోని కర్నాటక నాగేపల్లి వద్ద భూ రక్ష, శాశ్వత భూహక్కు రీ సర్వే రెండవ విడత ప్రారంభం సందర్భంగా డ్రోన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లాలో రెండవ దశ రీ సర్వే పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. రీ సర్వే వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈసారి పులివెందులలో జగన్‌కు లక్ష మెజారిటీ వస్తుందని కుప్పంలో కూడా వైసిపి గెలుస్తుందని అన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే వైసీపీని 2024లో కూడా ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టిడిపి నాయకుల పాదయాత్రతో ఉపయోగముండదన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్టణంలో 3వ వార్డు, ఆరవ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి తెలిపే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటరామిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, వైస్‌ చైర్మన్లు తిప్పన్న, శ్రీలక్ష్మి నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, వైసీపీ పట్టణ కన్వీనర్‌ రంగారెడ్డి, కౌన్సిలర్లు సాయి గీత, చెరువు భాస్కర్‌ రెడ్డి, సూర్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.