ప్రజాశక్తి-పెద్దదోర్నాల
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం సరి కాదని టిఎన్‌టియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టు సుధాకర్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య, మండల అధ్యక్షుడు కటికల శ్రీనివాసరావు అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఈ సందర్భంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. దాదాపు 40 రోజులుగా ఏం చెయ్యకూడదో అన్నీ వైసీపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన వారి భద్రత విషయంలోనే ప్రభుత్వం ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో సాధారణ ప్రజానీకం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ డాక్టర్ అని ఊదరగొడుతున్న ప్రభుత్వం మరి చంద్రబాబు వ్యక్తిగత వైద్యుడిని కూడా అనుమతించి ప్రత్యేక పరీక్షలు చేయించడంతో పాటు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావిక్రింది సుబ్బరత్నం, దొడ్డ శేషాద్రి, దేసు నాగేంద్ర, చల్లా వెంకటేశ్వర్లు, పఠాన్ ఖాన్, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు.










