Sep 16,2023 21:51

సీతానగరంలో దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న బేబినాయన

కొమరాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉన్న ప్రదేశంలో చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబుకు తోడుగా నేను అనే కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన కొనసాగుతుందన్నారు. టిడిపికి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబునాయుడును అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ రిలే దీక్షకు మండల జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి టి.జగదీశ్వరి, నియోజకవర్గ పరిశీలకులు, మండల అధ్యక్షులు ఎస్‌.శేఖర్‌ పాత్రుడు, నాయకులు సుదర్శన్‌ రావు మధుసూదన్‌ రావు, దేవకోటి వెంకట నాయుడు, జన సైనికులు పాల్గొన్నారు.
సీతానగరం : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట టిడిపి ఆధ్వర్యంలో శనివారం రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా బొబ్బిలి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బేబినాయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని జగన్‌ మోహన్‌ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్‌ బోనెల విజరు చంద్ర మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలంతా సైకో పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రిలే నిరాహార దీక్షలకు జనసేన మద్దతులిచ్చిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బి.రంజీవిలు, టిడిపి నాయకులు గర్భాపు ఉదయభాను, వాడాడ రాము, గొట్టాపు వెంకటనాయుడు, బలిజిపేట, సీతానగరం మండలాల టిడిపి అధ్యక్ష కార్యదర్శులు పి.వేణుగోపాల్‌ నాయుడు, కె.తిరుపతిరావు, బి.శ్రీనివాసరావు, జనసేన నాయకులు శ్రీనివాసరావు, చంటి తదితరులు పాల్గొన్నారు.
సీతంపేట: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సీతంపేటలో రెండో రోజు రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న పాలకొండ నియోజకవర్గ నాయకులు పడాల భూదేవి మాట్లాడుతూ త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గుమ్మడి సింహాద్రి, పైల సత్తిబాబు, బిడ్డిక దమయంతి నాయుడు, మాజీ ఎంపిపిలు సవర మాలయ్య, ఆరిక లచ్చుమయ్య, సవర కుంపి, సర్పంచ్‌ లు, మాజీ సర్పంచ్‌ లు సవర గంగారావు, సవర సూర్యారావు, సవర గంగయ్య, సవర మంగయ్య, సవర కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్‌ : జనసేన, టిడిపి పొత్తుతో వైసీపీలో వణుకు మొదలైందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని రెండు పార్టీల పొత్తు కుదిరిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. పట్టణ మెయిన్‌ రోడ్‌ లో టిడిపి చేపడుతున్న నిరసన దీక్షలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసిపిని ఓడించేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించినప్పటి నుంచి వైసిపి శ్రేణుల్లో వణుకు మొదలైందన్నారు. పదవిలో ఉన్న కొన్ని నెలలైనా ఒకసారి ఛాన్స్‌ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేలా పాలన సాగించాలన్నారు. కనీసం రోడ్డు గోతులనైనా కప్పేలా కష్టపడాలన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా తదితర రంగాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేసేలా పాలన సాగించాలన్నారు. టిడిపి నాయకులు చేపడుతున్న నిరసన దీక్షకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు జి.రవికుమార్‌, కౌన్సిలర్లు బి.గౌరీ నాయుడు, కోల సరితా మధు, తాతపూడి వెంకట్రావు, కోరాడ నారాయణరావు, బర్నాల సీతారామారావు పాల్గొన్నారు. జనసేన నాయకులు వి.దాలినాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్‌, పసుపురెడ్డి ప్రసాద్‌, తెంటు సురేష్‌, దువ్వాన మృత్యుంజయనాయుడు, గవర ఈశ్వరరావు తదితరులు మద్దతు తెలిపారు.