Aug 22,2023 21:47

'చలో విజయవాడ' పోస్టర్లను విడదుల చేస్తున్న సిఐటియు నాయకురాళ్లు

           ప్రజాశక్తి-ఉరవకొండ   మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్‌ 8న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి పిలుపునిచ్చారు. మంగళవారం ఉరవకొండలోని ఐసిడిఎస్‌ కార్యాలయ ప్రాంగణంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు పెట్టే భోజనంలో రకరకాలుగా మెనూమార్పులు చేస్తున్నారన్నారు. అయితే మెనూఛార్జీలను మాత్రం పెంచడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూఛార్జీలు పెంచాలని, కార్మికులకు పనికి తగ్గ వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. హైస్కూళ్లలో 9, 10 తరగతులకు అదనంగా వర్కర్లను కేటాయించాలన్నారు. వంట చేసే సమయంలో ప్రమాదాలకు గురైన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, నూతన విద్యా విధానం అమలులో స్కూల్స్‌ మెర్జ్‌ చేయడంతో అక్కడ ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాలని, వంటకు అవసరమైన వంట పాత్రలు ఇవ్వాలనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమాదేవి, శకుంతల యూనియన్‌ జిల్లా నాయకులు రామంజినమ్మ, శ్రీదేవి, నాగమ్మ, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.