ప్రజాశక్తి - కొమరాడ : ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదలి రావాలని సిఐటియు నాయుకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. మంగళ వారం రామభద్రపురం, మాదలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పిహెచ్‌ఒ ఆర్.బంగారుబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, టిఎ,డిఎలు ఇవ్వాలని ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ల ఇవ్వాలని బడ్జెట్లో నిధులు పెంచాలని, యూనిఫారం నాలుగు జతలు ఇవ్వాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఈనెల 30న ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లంతా కలిసి చలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కదిలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు గుంపమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, అంకమ్మ, చంద్రమ్మ, చిన్నమ్మి, పద్మ, సునీల, లక్ష్మి, హేమలత, పలువురు ఆశా, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.










