Jul 08,2023 20:02

తోపులాడుకుంటున్న ఇరువర్గాలు.

చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు
ప్రజాశక్తి - అవుకు

      దివంగత ఎమ్మెల్సీలు చల్లా రామకృష్ణారెడ్డి, చల్లా భగీరథ రెడ్డి కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మరణానంతరం ఆయన సతీమణి అవుకు మండల జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి పార్టీ బాధ్యతలను స్వీకరించడంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు చల్లా విగేశ్వర్‌ రెడ్డి చల్లా సోదరులతో కలిసి రాజకీయాల్లోకి అరంగ్రేటం చేశారు. కుటుంబంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఎమ్మెల్సీ సతీమణి చల్లా శ్రీలక్ష్మి, చల్లా విఘ్నేశ్వర రెడ్డిల మధ్య గొడవలు ప్రారంభమై చివరకు బహిరంగంగానే రోడ్డుపై గతంలో జరిగాయి. పోలీసులు, రాజకీయ పెద్దలు సర్ది చెప్పడంతో కొంతకాలంగా ప్రశాంతత నెలకొంది. అయితే అప్పటి నుండి చల్లా శ్రీలక్ష్మి పాల్గొనే కార్యక్రమాలకు ఎవరూ వెళ్లకుండా కఠినంగా ఆంక్షలు విధిస్తున్నారని, తన దగ్గరికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారని శనివారం మీడియా సమావేశంలో జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మీ తెలిపారు. అవుకు మండల జడ్పిటిసి సభ్యురాలినైనా తనను పార్టీ కార్యక్రమాలు కూడా పాల్గొనకుండా అడ్డు తగులుతున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను చల్లా విగేశ్వర్‌ రెడ్డి, చల్లా శ్రీలక్ష్మీ అనుచరులు వేరువేరుగా జరుపుకొని మీడియా సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే క్రమంలోనే గొడవ ప్రారంభమయింది. దీంతో బనగానపల్లె సిఐ తిమ్మారెడ్డి హుటాహుటిన చల్ల పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని ఇరుగ్రూపులను చెదరగొట్టారు. అనంతరం ఇరుగ్రూపుల నాయకులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. తనకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు బాధ్యులు చల్లా విగేశ్వర్‌ రెడ్డి, చల్లా రాజశేఖర్‌ రెడ్డి, చల్లా సూర్యప్రకాశ్‌ రెడ్డిలదే బాధ్యత అంటూ బహిరంగంగా జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి పేర్కొన్నారు.