Sep 27,2023 21:25

అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌

ప్రజాశక్తి-పార్వతీపురం : జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చిత్తశుద్ధితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదేశించారు. గరుగుబిల్లి ఎంపిడిఒ కార్యాలయంలో మండల స్థాయి ప్రత్యేక జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని బుధవారం జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అర్‌.గోవిందరావు, ఆర్‌డిఒ కె.హేమలత వినతులను స్వీకరించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 78 వినతులు అందాయి. భూ సమస్యలు పరిష్కరించాలని, సామాజిక పింఛన్లు పునరుద్ధరించాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పలువురు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులు అందించేందుకు జిల్లా కేంద్రానికి అర్జీదారులు రావాల్సిన పరిస్థితి తలెత్తకుండా మండల స్థాయిలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. వినతుల్లో కొన్ని...
ఎంపిడిఒ కార్యాలయం శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని మంజూరు చేయాలని, సీతాపురం ఆర్‌ అండ్‌ బి రోడ్డు నుంచి ఉద్యానవన విశ్వవిద్యాలయం వరకు బిటి రోడ్డుకు మరమ్మతులు నిర్వహించాలని, నూతన రహదారులు మంజూరు చేయాలని ఎంపిపి ఉరిటి రామారావు కోరారు.
సన్యాసిరాజుపేట గ్రామం వద్ద జంఝావతి కాలువ మీద కల్వర్టు నిర్మాణం చేపట్టి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన అప్పలస్వామి నాయుడు వినతి పత్రం సమర్పించారు.
సుంకి గ్రామ నిర్వాసితులకు పునరావాసం కింద టిఆర్‌ఎస్‌ వలసలో కేటాయించిన కాలనీని సుంకి గ్రామంలోనే మంజూరు చేయాలని వాకాడ కురిమినాయుడు దరఖాస్తు అందించారు.
ఎక్కింవలస, గరుగుబిల్లి భూముల మీదుగా ప్రధాన రహదారి నుంచి మల్లేడు చెరువు వరకు కాలువ పనులు చేపట్టి, అర్ధాంతంగా నిలిపేశారని, తోటపల్లి, జంఝావతి కాలువల నీరు అందక రైతులు నష్టపోతున్నారని, పొలాలకు సాగునీరు ఇప్పించే దిశగా చర్యలు చేపట్టాలని పిచ్చివలస గ్రామ సర్పంచి బి.నారాయణమ్మ వినతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ బి.జగన్నాథరావు, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఒ.ప్రభాకరరావు, డిపిఒ బలివాడ సత్యనారాయణ, జిల్లా సహకార అధికారి సన్యాసినాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్‌ పాల్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయగౌరి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ ఎం.డి.నాయక్‌, తహశీల్దార్‌ జి.వి.జనార్దన్‌, ఎంపిడిఒ జి.పైడితల్లి, తదితరులు పాల్గొన్నారు.