May 07,2023 20:52

తాగునీటి కోసం ట్యాంకు వద్ద గుమికూడిన గ్రామస్తులు

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని చిన్నమంతురు వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో శుద్ధ జల కేంద్రం ఉన్న కూడా ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఆదివారం గ్రామంలోకి వచ్చిన శుద్ధ జల ట్యాంకరు వద్ద గ్రామస్తులు పెద్దసంఖ్యలో గుమికూడారు. చిన్న పెద్ద తేడా లేకుండా నీటి కోసం ఎగబడ్డారు. గ్రామంలో ఉన్న శుద్ధ జల కేంద్రం కొన్ని నెలలుగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. మూతపడిన శుద్ధ జల కేంద్రాన్ని మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శికి నెలరోజుల క్రితం వినతిపత్రం అందజేశామన్నారు. అయినా కూడా స్పందన లేదన్నారు. దీంతో తమకు తాగునీటి సమస్య దినదినగండగా మారిందన్నారు. అసలే వేసవికాలం కావడంతో ఎండ ఉధతి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శుద్ధ జల ట్యాంకర్‌ గ్రామంలోకి ఎప్పుడు వస్తుందో తెలియక పనులు మానుకుని నీటి కోసం ఇంటివద్దనే ఉండాల్సి వస్తోందని వాపోయారు. పొలంపనులకు, కూలి పనులకు కూడా వెళ్లకుండా నీటి కోసం ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో ఉన్న శుద్ధ జల కేంద్రాన్ని మరమ్మతులు చేపట్టి ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.