ప్రజాశక్తి -గరుగుబిల్లి : చిలకాం గ్రామస్తుల అమాయకత్వంతో రాజకీయ నాయకులు ఆటాలాడుకుంటున్నారు. దశాబ్దాల తరబడి చిలకాం గ్రామానికి రహదారి లేకపోయినా ఏ పార్టీగానీ, ఏ నాయకుడుగానీ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. ఓట్లు కోసం వచ్చినప్పుడు కళ్లబొల్లి కబుర్లు చెప్పడం, ఆ తర్వాత ముఖం చాటేయడం, ప్రతి ఎన్నికల సమయంలోనూ నేతల చేతులో ఇలా మోసపోవడం ఆ గ్రామస్తులకు అలవాటుగా మారిపోయంది. దశబ్దాల తరబడి మండలంలో చిలకాం పంచాయతీ వాసులకు రహదారి సమస్య ప్రధాన సమస్యగా మారింది. పార్వతీపురం-పాలకొండ వెళ్లే ప్రధాన రహదారి నుంచి చిలకాం గ్రామానికి వెళ్లే రహదారి అరకిలో మీటరు మేర ఉంటుంది. ఇది గుంతకులమయమైన మట్టి రోడ్డుపైనే దశాబ్దాల నుంచి ఆ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. మట్టి రోడ్డు మొత్తం గోతులు మయం కావడంతో, ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే గ్రామస్తులు హడలిపోతున్నారు. మరో మార్గం లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఛిద్రమైన మట్టి రహదారి మీదుగా రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పంది. ఇదే విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. దీంతో గ్రామస్తులే చందాలు వసూలు చేసుకుని, కంకరమట్టి వేసుకుంటూ వస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ ఆ రహదారిపై కంకర, ఇతర మట్టి కరిగిపోయి, గోతులమయంగా మారుతోంది. 2వేల జనాభా కలిగిన తమ గ్రామం పట్ల అధికారులు, నాయకులు చిన్నచూపు చూపడం తగదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు కోసం వచ్చినప్పుడు, తామున్నామంటూ మాయమాటలు చెప్పి, అవసరం తీరాక వారెవరు తమ రహదారి గురించి పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రోగులను, గర్భిణులను అత్యవసర సయమంలో ఈ రహదారి మీదుగా తరలించడం తలకుమించిన భారంగా మారుతోందని వాపోతున్నారు.
టెండర్లు పిలిచినా స్పందన కరవు...
2017లో చిలకాం రహదారి నిర్మాణానికి ఎంపి నిధులు నుంచి రూ.16 లక్షలు అప్పటి ఎంపి కొత్తపల్లి గీత నిధులు మంజూరు చేశారు. చిలకాం రహదారి పనులపై అప్పట్లోనే అధికారులు టెండర్లు సైతం పిలిచారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో చిలకాం రోడ్డు నిర్మాణానికి నోచుకోలేదు. మంజూరైన రూ.16 లక్షలు ఏమయ్యాయని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిలకాం రహదారి నిర్మాణానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
రాత్రయితే దడే
ఛిద్రమైన చిలకాం రహదారిపై ప్రయాణం చేయడానికి హడలిపోతున్నా గ్రామస్తులు రాత్రయితే మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఎంత పని ఉన్నా ఊరు దాటి రావడానికి భయపడుతున్నారు. అరకిలోమీటరు మేర ఉన్న చిలకాం రహదారి పక్కన విద్యుత్ స్తంభాలున్నా అవి నిరుపయోగం పడి ఉన్నాయి. దీంతో చీకటి పడేసరికి రోడ్డంతా గాడాంధకారం అలుముకుంటోంది. అసలే గోతులు, ఆపై కటిక చీకటి కావడంతో ఆ గ్రామస్తులు ఆ రోడ్డు మీదుగా ప్రయాణం చేయడానికి బెంబేలెత్తిపోతున్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు విద్యుత్ అధికారులను వేడుకున్నా స్పందించడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ స్తంభాలను సైతం గ్రామస్తులే విరాళాలు సేకరించుకుని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పంచాయతీలో నిధులు లేమి పేరుతో విద్యుత్ అధికారులు తమ గ్రామాన్ని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాయకులన్నా ప్రయోజనం సున్నా...
చిలకాం గ్రామం నుంచి ఎందరో నాయకులు ప్రతిప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జెడ్‌పిటిసిగా, ఎంపిటిసిలుగా పలువురు నాయకులు బాధ్యతలు స్వీకరించారు. కానీ, వారు ఏనాడూ చిలకాం రహదారి నిర్మాణానికి కృషి చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే వారంతా ప్రాధాన్యమిచ్చారని వాపోతున్నారు. అన్ని పార్టీల నాయకులు తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప, చిలకాం గ్రామాభివృద్ధికి ఏ ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసిన పాపానపోలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, లేకుంటే సరైన సమయంలో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఎవరూ పట్టించుకోవడంలేదు..
నాకు 35 ఏళ్లు. నేను పుట్టినప్పటి నుంచి మట్టి రోడ్డుపై నుంచి రాకపోకలు సాగిస్తున్నాం. మా తండ్రులు, మా తాతలు కూడా ఆ మట్టి రోడ్డుపైనే నడిచారు. మా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి రోడ్డు పక్కన విద్యుత్ దీపాలు సైతం వెలగడం లేదు. రాత్రయితే మాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. నాయకులంతా ఓట్లు కోసం వస్తుంటారు. కానీ మా కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు.
ద్వారపురెడ్డి దర్శిత్
గ్రామస్తుడు, చిలకాం










