Jul 31,2023 21:43

నరికివేసిన చీనీచెట్లను పరిశీలిస్తున్న దృశ్యం

బత్తలపల్లి : మండలంలో అధికార పార్టీకి చెందిన వారి చీనీచెట్లు నరికి వేయడం మండలంలో చర్చనీయాంశమైంది. బత్తలపల్లి వైఎస్‌ఆర్సిపి మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి, ఎంపీపీ బగ్గిరి త్రివేణిరెడ్డి దంపతులు సాగు చేస్తున్న చీనీచెట్లను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. తాడిమర్రి మండలం ఎం అగ్రహారం రెవెన్యూ గ్రామ పొలంలోనినాలుగు ఎకరాల భూమిలో రెండు సంవత్సరాల నుంచి 650 చీనీచెట్లను సాగుచేస్తున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలంలో క్రిమిసంహారకమందు పిచికారి చేయడానికి వెళ్లి నరికివేతకు గురైన చీనీచెట్లను గుర్తించారు. విషయం తెలుసుకున్న కన్వీనర్‌ బయపరెడ్డి వెంటనే పొలం వద్దకు వెళ్లి పరిశీలించి సుమారుగా 100 చీనీ చెట్లు నరికివేతకు గురైనట్లు గుర్తించారు.ఈ విషయమై తాడిమర్రి పోలీసులకు బాధిత రైతు బయపరెడ్డి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న తాడిమర్రి ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, పోలీసులు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పచ్చని చెట్లను నరకడం పిరికిపందల చర్య : తమను ధైర్యంగా ఎదుర్కోలేక పచ్చని చెట్లను నరికివేయడం పిరికిపందల చర్యల అని వైసిపి మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి విమర్శించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే చెట్లను నరికి వేశారని అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్నిధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.