Oct 25,2023 20:57

చీడపీడలతో పుచ్చిపోయిన వంగ చెట్టు

చీడపీడలతో...కూర'గాయాలు'
ప్రజాశక్తి - తిరుపతి (మంగళం)
వర్షాధారమైన కరువు జిల్లాలో పాడి పరిశ్రమ రైతును ఎంతగా ఆదుకుంటుందో, అంతేస్థాయిలో కూరగాయలు, పండ్ల సాగు సైతం అన్నదాతకు ఆదరువుగా ఉంటోంది.. వంగ, బెండ వంటి కూరగాయల సాగులో చాలామంది సన్న చిన్న కారు రైతులు జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఈ పంటల్లో చీడల సమస్య రైతులను భయపెడుతోంది. ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడితే చీడలను అదుపులో ఉంచవచ్చు. ప్రస్తుతం సాగులో ఉన్న వంగ, బెండ తోటల్లో అక్షింతల పురుగు(పెంకు పురుగులు), కొమ్మ , కాయ తొలుచుపురుగు ఎక్కువ ఆశించి పంటను నష్టపరుస్తున్నాయని జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం ఎడిఎ మెరుగు భాస్కరయ్య 'ప్రజాశక్తి'కి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి చీడల నివారణ చేపడితే నాణ్యమైన కూరగాయలు పండుతాయని సూచించారు. ప్రస్తుతం కూరగాయల ధరలు రెండు నెలలుగా కిందకు దిగిరానంటున్నాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తే 'ఎ'గ్రేడ్‌ ధరను దక్కించుకోవచ్చని పేర్కొన్నారు.
అక్షింతల పురుగు పిల్ల పురుగులు శరీరంపై వెంట్రుకలు కలిగి, ఆకుల ఈనెల మధ్య పచ్చదనాన్ని తినేసి, ఆకులను జల్లెడగా మారుస్తాయి. వీటి తల్లి పెంకు పురుగులు, ఆకులను, పూ మొగ్గలను తింటూ వాటిపై రంద్రాలు చేస్తాయి. ఎదిగే మొక్కలలో కొమ్మ తొలిచే పురుగు ఆశించి కొమ్మ చివర్లు వాడి ఎండిపోయేటట్లు చేస్తాయి. కాయలు ఏర్పడే దశ నుండి ఈ పురుగులు కాయలలో రంద్రాలు చేసి, పుచ్చు కాయలుగా చేసి అమ్మకానికి పనికి రాకుండా చేస్తాయి.
వంగ, బెండ పంటలను నాటిన తొలి దశలలో మొక్కలపై ఏవైనా అక్షింతల పురుగుల పెంకు పురుగులు గమనిస్తే వాటిని ఏరి నాశనం చేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను ఎప్పటికప్పుడు కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపుకు ముందు దశలో ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మి.ల్లీ క్లోరిపైరిపాస్‌, 2.5 మి. ల్లీ క్వినాల్‌ ఫాస్‌, 2 మి.ల్లీ ప్రొఫెనోఫాస్‌ లేదా 2 గ్రాముల లార్విన్‌ మందులలో ఒక దానిని 5 మి. ల్లీ వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చును.
కాపు దశలో, ఈ పురుగుల నివారణకు, కాయలు కోసే ముందు, ఈ పురుగులు ఆశించిన రెమ్మలను, కాయలను, పిందెలను పూర్తిగా తొలగించి నాశనం చేయాలి. తర్వాత కాయలు కోసేయాలి. కాయలు కోసిన తర్వాత, తోటలోని చెట్లు బాగా తడియునట్లు లీటరు నీటికి 0.5 గ్రా ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌, 0.4 మి. ల్లీ కోరాజిన్‌, 2 మి.ల్లీ ప్రొఫినోపాస్‌ లేదా 0.4 మి. ల్లీ స్పైనోసాడ్‌ మందులలో ఒక దానిని 5 మి. ల్లీ వేప మందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి, ఒకసారి కొట్టిన మందు తిరిగి కొట్టకుండా, మందు మార్చి 7-10 రోజుల వ్యవధిలో స్ప్రే చేయాలి. వంగ, బెండ కాయలు కోసేముందు రైతులు ఎట్టి పరిస్థితులలోనూ మందులు స్ప్రే చేయకూడదు.
ఈ కూరగాయల తోటలలో పచ్చ దోమ, తెల్ల దోమ, పెను వంటి రసం పీల్చే పురుగులు గమనిస్తే పై మందులతో పాటు లీటర్‌ నీటికి 0.5 మి. ల్లీ ఇమిడాక్లోప్రిడ్‌ లేదా 2 మి. ల్లీ రోగార్‌ మందును కలుపుకొని స్ప్రే చేయాలి.
చీడపీడలతో పుచ్చిపోయిన వంగ చెట్టు