Jul 27,2023 20:29

అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో చిన్నపాటి వర్షమొచ్చినా రోడ్డుపై నీరు నిలిచి జనం రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైల్వే స్టేషన్‌ రోడ్డులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆవరణ చెరువును తలపించింది. భారీగా నీరు నిలవడంతో సమీప దుకాణదారులు బంద్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువైపు వెళ్లేవారు మురుగునీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కాలువల వెడల్పు, పూడికతీత కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని పురవాసులు వాపోతున్నారు.
మేల్కొన్న మున్సిపల్‌ అధికారులు
కాలువలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించింది. మర్చంట్‌ క్లబ్‌ వద్ద కల్వర్టులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. రోడ్డుపై నీరు నిలిచింది. స్థానికల నుంచి వ్యతిరేకత రావడంతో మేల్కొన్న మున్సిపల్‌ అధికారులు గురువారం రెవెన్యూ భవన్‌ నుంచి మర్చంట్‌ క్లబ్‌ వరకు కాలువలపై ఏర్పాటు చేసుకున్న బంకులను, కట్టడాలను తొలగించారు. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు హెచ్చరించారు. కట్టడాలు కూల్చివేయడంతో నీరంతా కాలువల వెంట పారి సమస్య పరిష్కారమైంది. మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, ఇంజనీర్‌ నాగభూషణం రెడ్డి ఉన్నారు.