చెరువులు, కుంటలు కబ్జా
- అలుగులు ధ్వంసం చేసి భూమి ఆక్రమణ
- పట్టించుకోని రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
నేటి ఆధునిక కాలంలో మనిషి దురాశ ప్రకృతి సంపదలపై, సహజ వనరులపై పడుతోంది. వాటిని ధ్వంసం చేస్తూ స్వలాభం కోసం కబ్జాలకు పాల్పడుతున్నారు. బండి ఆత్మకూరు మండలంలో రాజుల కాలంలో ఏర్పాటు చేసిన చెరువులు, కుంటలను ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ, మైనర్ ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తూ వాటి పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
బండి ఆత్మకూరు మండలంలో పురాతన కాలం నుంచి ఉన్న చెరువులను, కుంటలను కొందరు స్వార్ధపరులు కబ్జాలకు పాల్పడుతున్నారు. మండలంలో దాదాపు 16 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు తెలుగంగ ప్రాజెక్టు నుండి నీటిని మళ్లించి తద్వారా వ్యవసాయానికి సాగునీటి వదులుతారు. మండలంలోని ఈ చెరువుల ద్వారా ప్రాచీన కాలం నుండి వ్యవసాయం చేస్తూ ప్రజలు జీవిస్తున్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా సాగునీటి వసతులు పెరగడంతో ఈ ప్రాంతంలోని కొందరు స్వార్ధపరులు చెరువు భూములపై, కుంట భూములపై కన్నేశారు. చెరువు అలుగులను, కుంటలను ధ్వంసం చేసి వ్యవసాయ భూములుగా మార్చేస్తున్నారు. చెరువులు, కుంటల కబ్జా విషయం రెవెన్యూ అధికారులు, మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని సంత జుటూరు గ్రామంలో చందనపు చెరువు ఉంది. నారాయణపురం గ్రామంలో బ్రాహ్మణ చెరువు, కొత్తచెరువు, చిన్నదేవలాపురం గ్రామంలో తుమ్మలచెరువు, పెద్దదేవలాపురంలో ఎర్ర చెరువు, జిసి పాలెంలో పోతచెరువు, నెమల్లకుంట చెరువు, మొండికట్ట చెరువు, కృష్ణమ్మ కుంటలు ఉన్నాయి. జి.లింగాపురంలో కొత్తచెరువు, రామాపురంలో వడ్డేవానికుంట చెరువు, బండిఆత్మకూరులో చిన్న చెరువు, సింగవరంలో ఆముదాల చెరువు, బి.కోడూరులో నాగుల చెరువు, బసాపురం కుంట, కడమల కాల్వలో ప్రేమ చెరువు, ఈర్నపాడులో నాయిని చెరువులు ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ప్రాచీన కాలం నుండి ఉన్న చెరువులను, కుంటలను, చెరువు భూములు కబ్జాదారుల నుండి కాపాడాలని మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
చెరువులను సంరక్షించాలి
ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు మండలంలోని చెరువులను, కుంటల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. వారసత్వ సంపదగా ఉన్న చెరువులను కొందరు స్వార్థం కోసం కబ్జాలు చేస్తూ చెరువు కట్టలను, అలుగులను ధ్వంసం చేస్తూ నాశనం చేస్తున్నారు. చెరువుల భూములను సాగుగా మార్చి కబ్జా చేస్తున్నారు. కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
కంపమల్ల చిన్న మద్దిలేటి. మాజీ జెడ్పిటిసి.
కబ్జాదారుల నుండి చెరువులను, కుంటలను కాపాడాలి
బండి ఆత్మకూరు మండలంలో ప్రాచీన కాలం నుండి ఉన్న చెరువుల కింద, నీటి కుంటలపైన ఆధారపడి వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో చెరువు భూములపై, నీటి కుంటల భూములపైన, చెక్ డాం భూములపై కబ్జాదారులు కన్నేశారు. వాటి అలుగులను, కట్టలను ధ్వంసం చేసి సాగుభూములుగా తయారు చేసుకుని కబ్జా చేస్తున్నారు. ఆక్రమణదారులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వాటిని కాపాడాలి.
రత్నమయ్య, సిపిఎం బండి ఆత్మకూరు మండల కార్యదర్శి.










