Oct 21,2023 19:55

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన రైతులు

ప్రజాశక్తి - ఆదోని
పంటలకు సాగునీరందించే చెరువుకు గండిపడి నాలుగేళ్లు గడిచినా కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదని, వెంటనే చెరువుకు గండి పూడ్చాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు డిమాండ్‌ చేశారు. శనివారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామ చెరువు నుంచి సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. వరి, మిరప, పత్తి, ఉల్లి పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం కోల్పోయారన్నారు. నాలుగేళ్ల క్రితం చెరువుకు గండిపడడంతో మూసానపల్లె, చిన్నహోతూరు, చిగిలి గ్రామాల రైతులు సాగునీటిని నోచుకోవడం లేదని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎంపీ, ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం గండి పూడ్చిలేని ధీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో మరమ్మతులు చేసి ఉంటే నీరు నిలిచి పంటలకు సాగునీరందేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా గండి పూడ్చకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మూసానపల్లెలో సుమారు 70 మంది రైతులు బోర్లు వేయించుకున్నా నీరు రాని పరిస్థితి ఉందన్నారు. చెరువులో నీరు నిలిచి ఉంటే భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీరు పుష్కలంగా ఉండేదని తెలిపారు. వేదవతి నిర్మిస్తామని చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదన్నారు. మేళిగనూరు వరద కాలువ, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కోరారు. రైతులకు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. చెరువుకు గండి పూడ్చి వచ్చే వర్షాకాలంలోనైనా నీరు నిలిచేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేకపోతే రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుసంఘం జిల్లా సహాయ కారదర్శి హనుమంతు, రైతుసంఘం ఆలూరు కార్యదర్శి రంగస్వామి, ఆస్పరి కార్యదర్శి ఈరన్న, రైతులు ఉన్నారు.