ప్రజాశక్తి బుక్కపట్నం : మండల పరిధిలోని గూనిపల్లి గ్రామంలో ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన చెరువుకట్ట మరమ్మతు పనులను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. ప్రపంచబ్యాంకు ప్రతినిధులు శాంతును , వెంకట, షాగున్, రంజన్ తదితరులు రూ. 83 లక్షల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న చెరువు కట్ట మరమ్మతులు పనులు పరిశీలిస్తున్న సందర్భంలో గ్రామానికి చెందిన రైతులు తమ సమస్యలను వారికి విన్నవించారు. చెరువు కట్ట నిర్మాణపనులు కొంతమేర తమ పట్టా భూములలో చేపట్టారని కాంట్రాక్టర్ తమకు నష్టపరిహారం అందేలా హామీ ఇచ్చి మోసం చేశారని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అదేవిధంగా చెరువులో నీరు నిలువ ఉండకుండా చెరువు దిగున ఉన్న హంద్రీనీవా కాలువలోకి వెళ్లిపోతుండటంతో చెరువులో నీరు లేకుండా పోతోందని, కట్ట వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని రైతులు అధికారులకు వివరించారు. అయితే రైతుల సమస్యలు పట్టించుకోని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవయ్య, ఇరిగేషన్ ఎస్‌ఇ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈ నారాయణ నాయక్, వాటర్ రిసోర్స్ ఆఫీసర్ గంగాధర్, అగ్రి అడ్వైజర్ బోర్డు చైర్మన్ రమణారెడ్డి, ఇరిగేషన్ జేఈలు సుధాకర్ రాజు, జమున భారు, హార్టికల్చర్, అగ్రికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.










