Sep 23,2023 19:57

జిపిఎస్‌ అమలు నిర్ణయంపై ఉద్యోగులు ఆగ్రహం
ఎన్నికల్లో ఒపిఎస్‌ అమలుకు హామీ ఇచ్చి మోసగిస్తారా
సిపిఎస్‌ కంటే దారుణమైన జిపిఎస్‌ను అంగీకరించేదిలేదంటున్న ఉద్యోగ సంఘాల నేతలు
నిరసనలకు ఫ్యాప్టో పిలుపు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

తాము అధికారంలోకి వస్తే వారం, పది రోజుల్లోనే సిపిఎస్‌ (కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌)ను రద్దు చేసి ఉద్యోగులకు ఒపిఎస్‌ (ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌) అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన వైసిపి ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటుందని ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో 'మీరు చెప్పిందేంటీ.. ఇప్పుడు చేస్తున్నదేంటీ' అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకొచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ తెస్తానని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు తర్వాత జిపిఎస్‌ అమలుకు ప్రభుత్వం ముందుకు సాగడం అత్యంత దారుణమని ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తెస్తున్న జిపిఎస్‌ కంటే ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్‌నే మెరుగైందని, తమకు ఒపిఎస్‌ అమలు మాత్రమే అంగీకారమని తెగేసి చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది సంఖ్యలో సిపిఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఎన్నోఏళ్లుగా సిపిఎస్‌ రద్దు కోసం పోరాడుతున్నారు. టిడిపి ప్రభుత్వ హాయాంలోనూ ర్యాలీలు, నిరసనలు, కలెక్టరేట్‌ ముట్టడి వంటి అనేక ఆందోళనలు చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు ఉద్యోగులు కోరిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ను రద్దు చేస్తామని వైసిపి అధ్యక్షుని హోదాలో జగన్‌ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకొచ్చాక ఆ మాటే మరిచిపోయారు. దీంతో ఉద్యోగులు మళ్లీ ఆందోళనల బాట పట్టాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ తెస్తామంటూ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుంది. జిపిఎస్‌ను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జిపిఎస్‌ అమలుకు రాష్ట్ర మంత్రి మండలిలో సైతం తీర్మానం చేసింది. దీంతో ఉద్యోగులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో తహశీల్దార్‌, కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద ఆందోళనకు ఇప్పటికే పిలుపునిచ్చారు. తమకు జిపిఎస్‌ వద్దని, ఒపిఎస్‌ కావాలని నినదిస్తున్న పరిస్థితి ఉంది.
సిపిఎస్‌ కంటే జిపిఎస్‌ దుర్మార్గమైంది
ఆర్‌.రవికుమార్‌, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

జిపిఎస్‌ను ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రస్తుతం అమలులో ఉన్న సిపిఎస్‌ కంటే జిపిఎస్‌ దుర్మార్గమైన స్కీమ్‌. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ఎటువంటి సొమ్మూ రాదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేదిలేదు. ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమలు చేపట్టాం. 25న చలో కలెక్టరేట్‌ కార్యక్రమం సైతం నిర్వహించనున్నాం.
కంట్రీబ్యూషన్‌ అనేది ఉండకూడదు
పిబివిఎన్‌ఎల్‌ నారాయణ, ఫాప్టో ఛైర్మన్‌

ఉద్యోగులు కోరుతున్నది ఒక్కటే జిపిఎస్‌ వద్దు.. ఒపిఎస్‌ కావాలని. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఏమాత్రం సహేతుకం కాదు. జిపిఎస్‌లో ప్రతినెలా పది శాతం కటింగ్‌ అవుతుంది. కంట్రిబ్యూషన్‌ అనేది తీసేసి ఒపిఎస్‌ అమలు చేయాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగులెవ్వరూ సమ్మతించడం లేదు.
ఒపిఎస్‌ ఇస్తేనే ఉద్యోగులకు సంతోషం
కె.రమేష్‌, ఎపి జెఎసి అమరావతి జిల్లా ఛైర్మన్‌

ఏఒక్క ఉద్యోగీ జిపిఎస్‌ను అంగీకరించే పరిస్థితి లేదు. ఒపిఎస్‌ను అమలు చేస్తేనే ఉద్యోగులు సంతోషంగా ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఒపిఎస్‌ను అమలు చేయాలి. ఉద్యోగ సంఘాల నాయకులుగా తామంతా ఒపిఎస్‌నే కోరుకుంటున్నాం.
ఉద్యోగులంతా జిపిఎస్‌కు వ్యతిరేకమే
సిహెచ్‌.శ్రీనివాసరావు,

ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్‌, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా
ప్రభుత్వం చెబుతున్న జిపిఎస్‌కు ఉద్యోగులంతా వ్యతిరేకమే. సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. కంట్రీబ్యూషన్‌ లేని మెరుగైన పెన్షన్‌ భద్రత ఉండాలి. అప్పుడే ఉద్యోగులకు మేలు జరుగుతుంది.
జిపిఎస్‌లో ఉద్యోగ విరమణ పొందాక సొమ్ము రాదు
బొరగం రెడ్డిదొర, ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు

సిపిఎస్‌లో పదిశాతం ఉద్యోగుల సొమ్ము, పది శాతం ప్రభుత్వ సొమ్ము కంట్రీబ్యూషన్‌ ఉంటుంది. జిపిఎస్‌లో ఉద్యోగులకు సంబంధించిన పదిశాతం మాత్రమే ఉంటుంది. సిపిఎస్‌ కంటే జిపిఎస్‌ మరింత దారుణమైన పెన్షన్‌ పథకం. ఉద్యోగ విరమణ పొందాక జిపిఎస్‌ విధానంలో సొమ్ములేవీ రావు. ప్రభుత్వ నిర్ణయం ఏమాత్రం ఒప్పుకోం. ఉద్యోగ విరమణ పొందాక ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందని చెబుతున్నారు. అప్పటి వరకూ పిల్లల చదువులు పూర్తి కాకుండా ఉంటాయా.. ప్రభుత్వం చెప్పాలి.
పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టే
జి.కృష్ణ, ఎపిటిఎఫ్‌ 1938, జిల్లా ప్రధాన కార్యదర్శి

సిపిఎస్‌ను రద్దు చేసి జిపిఎస్‌ అమలు చేస్తే ఉద్యోగులంతా పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లే. సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చడం దారుణం. జిపిఎస్‌ కావాలని ఉద్యోగులు ఎవరైనా అడిగారా ప్రభుత్వం చెప్పాలి. ఒపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్‌ కాదు. చాలా రాష్ట్రాలో ఒపిఎస్‌ ఇచ్చారు. ఉద్యోగులను మోసం చేయడం దారుణం.