ప్రజాశక్తి - గోనెగండ్ల
'అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న చందంగా తయారైంది గోనెగండ్ల మండల పరిస్థితి. మండలంలో గాజులదిన్నె (సంజీవయ్య సాగర్) ప్రాజెక్టుతో పాటు తుంగభద్ర దిగువ కాలువ ఉంది. మండలంలోని ఆయకట్టు భూములకు సాగునీరు, వివిధ గ్రామాల్లో తాగునీరు అందక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి బండగట్టు వాటర్ స్కీం, క్రిష్ణగిరి ఎత్తిపోతల పథకం ద్వారా పత్తికొండ, డోన్, క్రిష్ణగిరి మండలాలతో పాటు ప్రధానంగా కర్నూలుకు కూడా తాగునీరు అందిస్తున్నారు. మండలంలోని ప్రజలకు మాత్రం ప్రాజెక్టు నుంచి ఎలాంటి ప్రయోజనమూ లేకుండా తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర గురువారం గోనెగండ్ల చేరుకుంది. శుక్రవారం మండలంలో పాదయాత్ర కొనసాగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే సిపిఎం ప్రతినిధి బృందం మండలంలో పర్యటించి సాగు, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు లాంటి అనేక సమస్యలను గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి పాలకులు దృష్టి సారించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈసారైనా ఎల్‌ఎల్‌సి ఆయకట్టుకు పూర్తిగా నీరందేనా
గోనెగండ్ల మండలంలో తుంగభద్ర దిగువ కాలువ కింద 2,750 ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. గతంలో జులై నెలలో నీరు విడుదల చేస్తే వరి నారు వేసుకొని ఆగస్టులో నాట్లు వేసి, నవంబర్ నెలలో వరి కోతలు కోసుకునేవారు. అలాగే డిసెంబర్‌లో ఆరుతడి పంటలకు ఆయకట్టుకు నీరందిస్తే వేరుశనగ పంట సాగు చేసేవారు. మార్చి, అవసరమైతే ఏప్రిల్ చివరి నాటికి రైతులు పంటలు పండించుకునేవారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందడం లేదు. అసలు ఆయకట్టుకు నీరు వస్తాయో, రావో తెలియదు. ఒకవేళ వచ్చినా ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అందిస్తారో కూడా అధికారులు రైతులకు చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ఆయకట్టు భూములను సాగు చేయాలా వద్దా అని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పక్కనే ప్రాజెక్టు... తాగునీరు సౌకర్యం సున్నా
మండలంలో పక్కనే ప్రాజెక్టు ఉన్న గోనెగండ్లతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు తాగునీరు మాత్రం అందడం లేదు. మండల జనాభా సుమారు 75 వేలు. జనాభాకు అనుగుణంగా తాగునీటి సౌకర్యం కల్పించడం లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం గోనెగండ్లతో పాటు అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్ ట్యాంకులే ప్రధానమైన నీటి ఆధారం. గోనెగండ్ల మేజర్ పంచాయతీతో పాటు మండలంలోని పశ్చిమ పల్లెలైన గంజిహళ్లి, బైలుప్పల, అగ్రహారం, అల్వాల, పెద్దమరివీడు, చిన్నమరివీడు, పెద్దనేలటూరు, హెచ్.కైరవాడి గ్రామాల్లో నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ కింద తాగునీటి పనులు మంజూరైనా అవి ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి.
షాదీఖానా లేక ముస్లిం, మైనారిటీల ఇబ్బందులు
గోనెగండ్ల మేజర్ పంచాయతీలో జనాభా 17 వేలు. అందులో ముస్లిం జనాభా సుమారు 6వేలు. గ్రామంలో వివాహాల నిర్వహణకు స్థలం లేక ఇరుకు వీధులు, చిన్న సందుల్లో మైనార్టీలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం షాదీఖానాను ఏర్పాటు చేసినప్పటికీ అప్పుడు అక్కడ స్థలం అనువుగా లేకపోవడం, సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల అది శిథిలమైంది. తిరిగి 2017లో రూ.35 లక్షలు షాదీఖానా పునర్నిర్మాణం కోసం మంజూరయ్యాయి. సకాలంలో ఆ నిధులను వినియోగించుకోకపోవడం వల్ల వెనక్కి వెళ్లాయి.
సచ్చినా తప్పని తిప్పలు...
- శ్మశానాలకూ స్థలం కొరతే
మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు సచ్చినా మృతదేహాన్ని పూడ్చడానికి కూడా తిప్పలు తప్పడం లేదు. ఇటీవల మండలంలోని బి.అగ్రహారం గ్రామంలో కొంతమంది వ్యక్తులు మృతి చెందగా పూడ్చడానికి స్థలం లేక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఆ మృతదేహాలను పూడ్చుకోవాల్సి పరిస్థితి వచ్చింది. పెద్దనేలటూరు, బోదేపాడు గ్రామాల్లో శ్మశాన స్థలం కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే వారే లేరు. ఇది ఒక్క అగ్రహారంలోనే కాదు మండలంలోని పలు గ్రామాల్లో ఉంది. ఐరన్‌బండ, కులుమాల, ఎర్రబాడు, నెరుడుప్పల గ్రామాల్లో శ్మశాన సమస్యను ఎదుర్కొంటున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అరకొరగా ఉన్న శ్మశాన స్థలాలు కబ్జాకు గురవుతుండడం వల్ల వాటికి ప్రహరీలను ఏర్పాటు చేసి కబ్జాకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఎప్పటి వరకు నీటిని వదులుతారో చెప్పాలి
- కురువ లింగన్న, ఆయకట్టు రైతు
నాకు 4 ఎకరాల ఆయకట్టు పొలం ఉంది. అదనంగా 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఆయకట్టుకు నీటిని సకాలంలో విడుదల చేసేలా నాయకులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎప్పటి వరకు నీటిని వదులుతారో, ఏయే పంటలు సాగు చేసుకోవాలో ముందస్తుగా తెలియజేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఐదు రోజులు దాచుకొని తాగాల్సి వస్తోంది
- పార్వతి, గ్రామస్తురాలు
గ్రామంలో అల్వాల ట్యాంకు నుంచి ఐదు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. ఆరోజు తప్పితే మళ్లీ ఐదు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే వచ్చినప్పుడే నీటిని పట్టుకుని ఐదు రోజులపాటు దాచి పెట్టుకొని తాగే పరిస్థితి ఉంది.
శిథిలావస్థకు చేరిన షాదీఖానా










