Oct 22,2023 23:15

పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి చెంచు గూడెంలో విష జ్వరాలు ప్రభలిన నేపథ్యంలో ఐటిడిఎ డిప్యూటీ డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ సోమ శేఖరయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్వరాలతో బాధ పడుతున్న గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి సెలైన్‌లు పెట్టారు. సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. గర్భిణులు, చిన్నారులకు వ్యాక్సిన్‌ వేశారు. రక్తహీనతతో బాధ పడుతున్న వారికి ఐరన్‌ టానిక్‌లు, ప్రొటిన్‌ పౌడర్లు పంపిణీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని చెప్పారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పూజా, షాహిన్‌, నలగాటి వెంకట్రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.