Sep 26,2023 21:26

టేకు చెట్టు మీదుగా వెళ్తున్న విద్యుత్‌ కనెక్షన్‌

ప్రజాశక్తి - మక్కువ : అవినీతికి అలవాటు పడ్డ అధికారుల చేతులు తడిపితే చాలు ఏ నిబంధనలైనా తిరగరాసే పరిస్థితి మండల విద్యుత్‌ శాఖలో చోటుచేసుకుందని చెప్పడంలో అతిశయోక్తి కాదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్‌ కుమ్మక్కయితే ఆ అవినీతి గురించి అసలు చెప్పనక్కరలేదు. సామాన్య రైతులకు ఒక తీరు, పలుకుబడి ఉన్న వ్యక్తులకైతే మరో విధంగా పనులు చేసేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇందుకు మండలంలో మంజూరు చేసిన విద్యుత్‌ కనెక్షన్లే నిదర్శనం. ప్రభుత్వ నిబంధన నిబంధన ప్రకారం ఓ రైతుకు విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ నుండి సుమారు 180 మీటర్ల పరిధిలో అంటే సుమారు మూడు స్తంభాల దూరంలోగా అమర్చాల్సి ఉంటుంది. అయితే మండలంలో గత ఏడాది కాలంలో ఈ నిబంధన అంతంతమాత్రంగానే అధికారులు పాటిస్తూ సంబంధిత కాంట్రాక్టర్‌కు మేలు చేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక ట్రాన్స్ఫార్మర్‌ నుండి సుమారు 300 మీటర్ల వరకు విద్యుత్‌ కేబుల్‌ను తీసుకువెళ్తూ కనెక్షన్‌ మంజూరు చేస్తూ ఆయా ప్రాంతాల్లో రైతుల నుండి దండిగా మామూళ్లు వసూలు చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖ అధికారుల అంచనాలు కొన్నిచోట్ల అధికంగా వేస్తూ మరికొన్ని చోట్ల సాధారణంగా వేస్తూ కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరేలా గతంలో నిర్ణయాలు చేపట్టి తద్వారా విద్యుత్‌శాఖ అధికారులు భారీగా కాంట్రాక్టర్‌ ద్వారా లబ్దిపొందినట్టు ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మండలంలోని మూకవలసకు వెళ్లే రహదారిలో విఆర్‌ఎస్‌ కుడి ప్రధాన కాలువకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ కు సుమారు 300 మీటర్లు నిడివిలో టేకు చెట్లను ఆధారం చేసుకుని విద్యుత్‌ సర్వీస్‌ లైన్‌ వేయడం పలువురుని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాక మండలంలోని కవిరిపల్లి - శంబర రహదారుల్లో ఇలాంటి విద్యుత్తు లైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పలు స్తంభాలపై కాంట్రాక్టర్‌ ఉపయోగించాల్సిన పనిముట్లు ఇన్సులేటర్లు, కేసరాలు అమర్చకుండానే వైర్లతో వేలాడ తీసి విద్యుత్‌ కనెక్షన్లు వేయడం దర్శనమిస్తుంది. అలాగే మక్కువ మెయిన్‌ బజార్లో ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కు 60 కెవిఎ ట్రాన్స్ఫార్మర్‌ ఏర్పాటు చేసి తరుణంలో వివాదాలు రావడంతో అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కూడా సుమారు 300 మీటర్ల నుండి వేరొక ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా విద్యుత్తును నేరుగా సరఫరా చేశారు. అయితే గతంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్‌ ఏమైందోనని పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పనులు జరుగుతున్న తీరును పరిశీలించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం కూడా ఈ దుస్థితి కారణమని కాంట్రాక్టర్‌తో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడమే ఈ దుస్థితికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టినట్లయితే మరెన్నో అక్రమాలు వెలుగు చూసే ఆస్కారం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.