ప్రజాశక్తి - మక్కువ : ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పని ప్రజలకు వివరించాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. గురువారం వైసిపి ఎందుకు ఆంధ్రకు జగననే కావాలి కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ తెలియజేసే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజలకు చేరవేసే బాధ్యత గృహసారథులు కన్వీనర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఎ.వెంకంపేటలోని జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు వైద్య సిబ్బందిని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు, ఎంపిపి మర్రి పారమ్మ, వైసిపి మండల అధ్యక్షులు మావుడి రంగునాయుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కురుపాం : ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లాల్సిన బాధ్యత గ్రామస్థాయిలో ఉండే ప్రజాప్రతినిధులదేనని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గురువారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానం వద్ద మండలంలో గల సర్పంచులకు, ఎంపిటిసిలకు, వైసిపి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి లబ్ది పొందుతున్నారో అన్న దానిపై ప్రజలకు వివరించాలని అన్నారు. జిల్లా వైసిపి అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ పెట్టి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. ఈ వివరాలకు ప్రజలకు విపులంగా వివరించాల్సిన బాధ్యత వైసిపి కుటుంబ సభ్యులదేనన్నారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జెడ్‌పిటిసి జి.సుజాత, జిల్లా కో ఆప్షన్ సభ్యులు షేక్ నిషార్, మండలంలో సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










