ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : చేనేతరంగానికి సంబందించిన 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని పక్కాగా అమలుచేయాలని ఎపి చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో చేనేత కార్మికసంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామాంజినేయులు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన చేనేత రంగం నేడు పాలకులు అధికారుల నిరక్ష్యం వల్ల తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. చేనేత 11రకాల రిజర్వేషన్ చట్టాన్ని సక్రమంగా అమలుజరపకుండా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు చేనేత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. చేనేతకు రూ.200 కోట్లు మాత్రమే బడ్జెట్ కేటాయించారని, అది నేతన్ననేస్తం, ఉద్యోగులకు జీతభత్యాలకే సరిపోతుందని అన్నారు. చేనేతకు రూ.1000 కోట్లు ప్రతిఏడాది బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. చేనేతపై జిఎస్‌టి రద్దుచేయాలని, నేతన్ననేస్తం పథకాన్ని ప్రతి చేనేత కార్మికుడికి వర్తింపచేయాలని, ముడిసరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. చేనేతల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 19న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఈ ధర్నాకు జిల్లాలోని ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈసమావేశంలో చేనేత కార్మికసంఘం తాలూకా కార్యదర్శి వెంకటనారాయణ, జాతీయ ఐక్యవేదిక వర్కింగ్ ప్రసిడెంట్ చుట్టారవివర్ధన్, చేనేత సంఘం నాయకులు రవికుమార్, రమణ, వెంకటస్వామి, అన్నం సూరి తదితరులు పాల్గొన్నారు.










