ధర్మవరం టౌన్ : పార్లమెంటులో తయారుచేసిన చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంలో పాలకులు విఫలం చెందారని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం కార్మికులు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం తరువాత అన్ని వర్గాల ప్రజలు చేనేత వత్తిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అలాంటి పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే ఎమ్మెల్యే, ఎంపిలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్ చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్‌పై ఉందన్నారు. పరిశ్రమ నేడు కుదేలవుతోందని దీంతో చేనేత కార్మికులు భవన నిర్మాణ కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా మారుతున్నారన్నారు. చేనేత రండం పరిరక్షణకు పాటుపడాల్సిన కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రిజర్వేషన్ చట్టం గురించి ఎన్‌ఫోర్స్‌మెంట్, హ్యాండ్లూమ్ అధికారులు, కలెక్టర్ మాట్లాడలేకపోతున్నారన్నారు. చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ. లక్ష ఇవ్వాలని, ఇళ్లు కట్టించాలని, బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై జూన్ 9వ తేదీ అమరావతిలోని కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడుతామని స్పష్టం చేశారు. ధర్నాలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ఆదినారాయణ, అయూబ్ ఖాన్, ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, చేనేత కార్మిక సంఘం నాయకులు చౌడప్ప, హరి, అన్నం సూరి, వెంకటస్వామి, రాము, తదితరులు పాల్గొన్నారు.










